శ్రీశైలం దేవస్థానంలో రూ.3 కోట్లకు పైగా అక్రమాలు
- ప్రస్తుత విచారణలో రూ.1.42 కోట్లుగా వెల్లడైందన్న ఈవో
- అక్రమాలన్నీ టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగినవే!
- ఒక సత్రం పేరుతో ఐడీని సృష్టించి రూ.50 లక్షల దోపిడీ
- ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించిన దేవదాయశాఖ మంత్రి
శ్రీశైలం/సాక్షి, అమరావతి: ప్రముఖజ్యోతిర్లింగ శైవక్షేత్రమైన కర్నూలు జిల్లాలోని శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామివార్ల దేవస్థానంలో ఆర్జిత సేవా టికెట్ల విక్రయాల్లో సుమారు రూ.1.42 కోట్ల అక్రమాలు చోటు చేసుకున్నాయని దేవస్థానం ఈవో కేఎస్ రామారావు తెలిపారు. సోమవారం దేవస్థానంలో ఈ విషయాన్ని విలేకరులకు తెలియజేస్తూ, 2016–18 మధ్య కాలంలో కంప్యూటర్‌లో ఉన్న సాంకేతిక లొసుగులను ఆధారం చేసుకుని అప్పట్లో ఆయా విక్రయ కేంద్రాల్లో పనిచేసిన కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది అక్రమార్జనకు పాల్పడినట్లు చెప్పారు.
ముఖ్యంగా రూ.150 శీఘ్రదర్శనం టికెట్లు, రూ.1,500 అభిషేకం, ఆర్జిత సుప్రభాత, మహామంగళ హారతి సేవాటికెట్లలోనే అక్రమాలు చోటు చేసుకున్నాయన్నారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేయాల్సిందిగా ఏఈవో స్థాయి అధికారిని నియమించామన్నారు. అక్రమాలపై రాష్ట్ర దేవదాయ శాఖ రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్లకు సమాచారమిచ్చామని తెలిపారు. శ్రీశైలం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. పోలీసు విచారణకుగానూ ఆత్మకూరు డీఎస్పీ వెంకటరావును నియమిస్తూ ఎస్పీ ఉత్తర్వులిచ్చారు.
అక్రమార్కుల దందా టీడీపీ హయాంలోనే!
ఈ దందా అంతా టీడీపీ ప్రభుత్వ హయాంలోనే జరగడం గమనార్హం. ఆలయంలో ఒక కౌంటర్‌లోని సిబ్బందిని మరో కౌంటర్‌లోకి బదిలీ చేస్తుండడం సహజంగానే జరుగుతుంటుంది. అయితే, బదిలీ అయిన వారి ఐడీ పాస్‌వర్డ్ ఆధారంతో కొత్తగా విధులకు వచ్చిన సిబ్బంది అదే పాస్‌వర్డ్‌ను ఉపయోగించి అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. 2018 జనవరి నుంచి డిసెంబర్ వరకు దేవస్థానం పరిధిలోని ఒక సత్రం పేరుపై ఐడీని రూపొందించి సుమారు రూ.50 లక్షల వరకు నిధులను మింగేశారు. ఇందుకోసం కొత్తగా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించి, ఐడీని ఏర్పాటు చేసుకుని దాని ద్వారా టికెట్లను విక్రయించి ఆ సొమ్మును కాజేశారు. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి అత్యంత ప్రాముఖ్యత కలిగి ఆర్థిక లావాదేవీలతో ప్రమేయం ఉన్న కౌంటర్లను కేటాయించడం, వాటిపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడం వలనే అక్రమార్కులకు వరంగా మారిందని తెలుస్తోంది.
విచారణకు ఆదేశించిన మంత్రి
శ్రీశైల ఆలయంలో దర్శన టికెట్ల వ్యవహారంలో అవినీతి ఆరోపణలపై దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు శాఖాపరమైన విచారణతో పాటు పోలీసు విచారణకు ఆదేశించారు. విషయం తెలిసిన వెంటనే కర్నూలు జిల్లా ఎస్పీతో మంత్రి ఫోన్లో మాట్లాడారని.. అవినీతికి పాల్పడ్డ సొమ్మును తిరిగి రాబట్టేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీని మంత్రి ఆదేశించినట్టు మంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. దేవదాయ శాఖ పరంగా ప్రత్యేకాధికారిని నియమించి విచారణ చేపట్టాలని, సైబర్ వ్యవహారాల్లో పరిజ్ఞానం ఉన్న అధికారి ద్వారా విచారణ జరిపించడంతో పాటు అంతర్గత ఆడిట్ రిపోర్టుతో సమగ్ర నివేదిక ఇవ్వాలని దేవదాయ శాఖ కమిషనర్ అర్జునరావును మంత్రి ఆదేశించారు.
మొత్తం రూ.3 కోట్ల పైనే!
తాజాగా బయటపడ్డ రూ.1.42 కోట్లు, పెట్రోల్ బంక్‌లో రూ.44 లక్షలు, డొనేషన్ కౌంటర్‌లో రూ.75 లక్షలు, ఇతర అక్రమాలు కలిపి మొత్తం సుమారు రూ.3 కోట్లపైనే మల్లన్నకు శఠగోపం పెట్టారని తెలుస్తోంది. ఇందులో పెట్రోల్ బంక్, డొనేషన్ కౌంటర్‌లో అక్రమాలకు పాల్పడ్డ కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ సిబ్బంది, సంబంధిత వ్యక్తుల నుంచి 50 నుంచి 60 శాతం వరకు నగదును తిరిగి వసూలు చేశారు.