నేడు, రేపు వడగాడ్పులు..
- రేపు బంగాళాఖాతంలోకి రుతుపవనాలు
- తెలంగాణపై కొనసాగుతున్న ఉపరితల ద్రోణి
- హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి
- పలు ప్రాంతాల్లో 46 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో మంగళవారం, బుధవారం రెండు రోజులు వడగాడ్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలా బాద్, కుమ్రంభీం, నిర్మల్, నిజామాబాద్, జగి త్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, మహబూబా బాద్, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్ జిల్లాల్లో మంగళవారం కొన్నిచోట్ల, బుధవారం అక్కడక్కడా వడగాడ్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం సీనియర్ అధికారి రాజారావు వెల్లడించారు.
దంచికొట్టిన ఎండలు..
సోమవారం పలు ప్రాంతాల్లో వడగాడ్పులతోజనం అవస్థలు పడ్డారు. నిర్మల్ జిల్లా కడ్డెం పెద్దూరు, సోన్ ఐబీ, మమ్డా, పొంకల్, లక్ష్మణ్ చంద, పాత ఎల్లాపూర్, నిజామాబాద్ జిల్లా కల్దుర్కి, చిన్నమావంది, ఆదిలాబాద్ సహా అదే జిల్లా తంసి, కామారెడ్డి జిల్లా పాత రాజంపేటల్లో 46 డిగ్రీల చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నల్లగొండ, మెదక్, నిజామాబాద్, ముత్తారం మంథని, తానూరు, బీరవల్లి, బేలా, లింగాపూర్, వడ్డాయల్, కుబీర్, తాండ్రలలో 45 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రామగుండంలో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మహబూబ్‌నగర్‌లో 43, హైదరాబాద్, హన్మకొండలలో 42 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భద్రాచలంలో 40 డిగ్రీలు నమోదైంది.
బంగాళాఖాతంలోకి రుతుపవనాలు
దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, దాన్ని ఆనుకుని ఉన్న బంగాళాఖాతం మధ్య ప్రాంతాల్లోని మరికొన్ని చోట్లకు ఈ నెల 27న నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు ఛత్తీస్‌గఢ్ నుంచి ఇంటీరియర్ తమిళనాడు వరకు తెలంగాణ, రాయలసీమ మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోందని వెల్లడించారు.