భాస్కర్.. ఏం నడుస్తుంది? :కేసీఆర్
- మర్కూక్ అభివృద్ధి ఎట్లుంది?
- కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టుపై ఆరా
- మర్కూక్, చేబర్తి సర్పంచ్‌లతో ఫోన్‌లో మాట్లాడిన సీఎం కేసీఆర్
గజ్వేల్/మర్కూక్ : క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు తనదైన శైలిలో స్వయంగా తెలుసుకునే ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. తాజాగా సిద్దిపేట జిల్లా మర్కూక్ మండల కేంద్రానికి చెందిన సర్పంచ్ భాస్కర్, అలాగే చేబర్తి సర్పంచ్ అశోక్‌లతో సీఎం కేసీఆర్ ఫోన్‌లో సంభాషించారు. ముందుగా మర్కూక్ మండల కేంద్ర సర్పంచ్ భాస్కర్‌తో మాట్లాడారు. మండల అభివృద్ధిని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూనే కొండపోచమ్మ సాగర్ నిర్మాణం తర్వాత ప్రజా స్పందన, ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లపై మాట్లాడారు. సోమవారం మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో కొద్దిసేపు సీఎంకు, భాస్కర్‌కు మధ్య సంభాషణ సాగిందిలా...
సీఎం కేసీఆర్: హలో భాస్కర్... నేను కేసీఆర్‌ను మాట్లాడుతున్న.. మర్కూక్‌లో ఏం నడుస్తుంది..? అభివృద్ధి పనులు ఎట్లున్నయ్.. పనులేమన్న పెండింగ్‌లో ఉన్నాయా..?
సర్పంచ్ భాస్కర్: సార్ నమస్కారం.. చాలా వరకు పనులు పూర్తి చేశాం. మర్కూక్ గ్రామ పంచాయతీ మోడల్ భవనం నిర్మాణం కోసం నిధులు కావాలె.
సీఎం: భాస్కర్ నువ్వు రందిపడకు.. మర్కూక్‌ను ఆదర్శంగా మార్చుకుందాం. అవసరమైతే మరో రూ.5–6 కోట్ల నిధులు మంజూరు చేస్తా. నువ్ దగ్గరుండి సమస్యలు లేకుండా చూసుకో.. అదే విధంగా రైతు వేదిక నిర్మాణం పనులు రాష్ట్రంలో మొట్టమొదటగా ప్రారంభించుకొని ఆదర్శంగా నిలుద్దాం. ఇందుకు సంబంధించి సర్వే కూడా పూర్తి చేయించిన.
సర్పంచ్: సంతోషం సార్.
సీఎం: ఇంకా ఏం నడుస్తుంది?
సర్పంచ్: సార్... మర్కూక్‌పై మీరు చూపిస్తున్న ప్రేమకు రుణపడి ఉంటాం. కొండపోచమ్మ సాగర్‌కు నీళ్లొస్తున్నాయని అందరూ సంబరపడిపోతున్నరు. ఎక్కడ చూసినా ఇదే ముచ్చట చెప్పుకుంటున్నరు.
సీఎం: సంతోషం.. త్వరలోనే కొండపోచమ్మ సాగర్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించుకుందాం. ఇందుకు సంబంధించి మర్కూక్‌లో 15 వందల మందికి సరిపడా భోజనాలు ఏర్పాటు చేసుకుందాం.. ఈ కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహించుకోవడం అవసరం. రైతుల కళ్లలో ఆనందం చూడాలనేదే నా తపన. అంతే కాకుండా మర్కూక్ శివారులోని 14 ఎకరాల్లో పబ్లిక్ పార్కును ఏర్పాటు చేసుకుందాం.. వెంటనే ఆ భూమిని క్లీన్ చేయాలి.
సర్పంచ్: సార్.. నేను దగ్గరుండి పనులు మొదలు పెడతా. ప్రతిరోజు గ్రామంలోని వార్డులన్నీ కలియ తిరిగి సమస్యలు లేకుండా చూసుకుంటా సార్..
సీఎం: సరే... కొండపోచమ్మ ప్రారంభోత్సవానికి సంబంధించి భోజనాలు ఏర్పాటు చేసే స్థలం, ఇతర ఏర్పాట్లను దగ్గరుండి చూసుకో.
సర్పంచ్: మంచిది సార్... తప్పకుండా ఏర్పాట్లలో నిమగ్నమవుతా.
సీఎం కేసీఆర్ తనకు ఫోన్ చేసి గ్రామాభివృద్ధి గురించి ఆరా తీయడంతో సర్పంచ్ భాస్కర్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయ్. ఈ విషయాన్ని గ్రామస్తులకు చెప్పుకుంటూ తన సంతోషాన్ని పంచుకున్నాడు.
చేబర్తి చెరువులో గోదావరి నీరు నింపుర్రి..
అశోక్.. నేను సీఎంను మాట్లాడుతున్న.. మంగళవారం చేబర్తి చెరువులోకి గోదావరి జలాలు వస్తున్నాయి.. ఏదో ఒక సమయంలో నీరు వదులుతారు.. రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డితో నేను మాట్లాడినా.. మీ ఎంపీపీ పాండుగౌడ్, జెడ్పీటీసీ మంగమ్మ రాంచంద్రంతో కలసి అందరూ బ్రహ్మాండంగా చెరువు నింపుర్రి. పూలు, పండ్లు తీసుకొచ్చి కొబ్బరికాయ కొట్టి చెరువు, కుంటల్లోకి నీరు వదులుర్రి..
సర్పంచ్ అశోక్: తప్పకుండా అందరితో మాట్లాడుతా.. మా చెరువు కుంటలను నింపుకుంటం సార్.. కృతజ్ఞతలు సార్..
సీఎం: ప్రతాప్‌రెడ్డితో కలసి బ్రçహ్మాం డంగా చెరువులు నింపుకొర్రి సరేనా..
సర్పంచ్: తప్పకుండా సార్..