https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/05/26/Tpcc.jpg?itok=F8N85-iC

నీళ్ల పేరిట నిధుల ఎత్తిపోత



సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో అనాలోచితంగా, తప్పుడు నిర్ణయాలతో ముందు కెళ్తోందని తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు, ఎంపీ ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. నీళ్లను సాకుగా చూపి అడ్డుగోలుగా నిధులు ఎత్తిపోస్తోందని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులను పూర్తి చేయకుండా, వాటికి నిధులివ్వకుండా ఒక్క కాళేశ్వరం ఎత్తిపోతలకే రూ. లక్ష కోట్లు ఖర్చు చేయడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. గ్రావిటీ ద్వారా అందించగల గోదావరి, కృష్ణా జలాలను వదిలిపెట్టి ఎత్తిపోతలకే ఎందుకు మొగ్గుచూపుతున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అనాలోచిత నిర్ణయాలను ఎండగట్టేందుకే కృష్ణా, గోదావరి బేసిన్‌ ప్రాజెక్టుల వద్ద దీక్షలకు దిగనున్నామన్న ఉత్తమ్‌ సోమ వారం ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే...

అదనపు టీఎంసీకన్నా.. పెండింగ్‌ ప్రాజెక్టుల పూర్తి మిన్న..
కాంగ్రెస్‌ హయాంలోనే కల్వకుర్తి, నెట్టెం పాడు, భీమా, ఎస్‌ఎల్‌బీసీ, దేవాదుల వంటి పథకాలు చేపట్టి 85 శాతం పూర్తి చేశాం. మరో రూ. 2–3 వేల కోట్లు ఖర్చు చేస్తే పూర్తిస్థాయిలో ఆయకట్టుకు నీళ్లొ స్తాయి. కానీ వాటిని ప్రభుత్వం పూర్తిగా పక్కనపెట్టింది. తమ్మిడిహెట్టి ద్వారా వచ్చే గ్రావిటీ గోదావరి నీటిని వదిలేసి రూ. లక్ష కోట్లతో కాళేశ్వరం ఎత్తిపోతలు చేపట్టింది. కాళేశ్వరం ద్వారా ఇంతవరకు ఒక్క ఎకరా కొత్త ఆయకట్టుకైనా నీళ్లిచ్చారా? కాళేశ్వరం ద్వారా ఎత్తిపోయకున్నా ఎస్సారెస్పీలోకి వచ్చిన వరద జలాల ద్వారా స్టేజ్‌–2 ఆయకట్టుకు నీళ్లిచ్చే అవకాశం ఉంది. తమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణానికి కేవలం రూ. 2 వేల కోట్లు ఖర్చవుతుంది. దీనిద్వారా సుమారు 100 టీఎంసీల నీటిని గ్రావిటీ ద్వారా సుందిళ్లకు తరలించి ఆదిలాబాద్‌ జిల్లాలో 2 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే అవకాశం ఉన్నా కేసీఆర్‌ ఎందుకు దీని నిర్మాణం చేయలేదు? రెండో టీఎంసీ నీటిని ఎత్తిపోయకుండానే కాళేశ్వరం ద్వారా 3వ టీఎంసీ నీటి ఎత్తిపోతలు చేపట్టారు. ఈ నిధులను తమ్మిడిహెట్టి, పెండింగ్‌ ప్రాజె క్టులపై ఖర్చు చేస్తే బాగుంటుంది కదా.

కృష్ణాపై ఏపీ కొత్త ప్రాజెక్టులు కడితే రాష్ట్రానికి నీరు గగనమే..
ఇప్పటికే కృష్ణా నదిలో వరద ప్రవాహాలు కరువయ్యాయి. ఆగస్టులో ఎగువ నుంచి వరద వచ్చినా 215 టీఎంసీల సామర్థ్యం ఉన్న శ్రీశైలం నిండి అక్కడి నుంచి సాగర్‌ వరకు నీరొచ్చేందుకు మరో నెలకుపైగా సమయం పడుతోంది. శ్రీశైలంపై ఆధార పడి తెలంగాణలో కల్వకుర్తి, ఎస్‌ఎల్‌బీసీ, పాలమూరు–రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులు న్నాయి. ఇవన్నీ ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల అవసరాలు తీర్చేవే. ఇలాంటి పరిస్థితుల్లో కొత్తగా ఏపీ పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 80 వేల క్యూసెక్కులకు పెంచినా, కొత్తగా రోజుకు 3 టీఎంసీల నీటిని లిఫ్ట్‌ చేసేలా కొత్త పథకాలు చేపట్టినా తెలంగాణకు నీరు దక్కడం గగనమే. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్‌కు నీరు రావాలంటేనే సెప్టెంబర్‌ పడుతోంది. ప్రస్తుతం శ్రీశైలం నుంచి నీటిని ఎప్పటికప్పుడే తీసుకుంటే అక్టోబర్, నవంబర్‌ వరకు నీరు రాదు. అదే జరిగితే సాగర్‌ కింది ఆయకట్టు 6.40 లక్షల ఎకరాలతోపాటు ఏఎంఆర్‌పీ తాగు, సాగునీటి అవసరాలకు పూర్తిగా విఘాతమే. దక్షిణ తెలంగాణ పూర్తిగా ఎడారే.

ప్రభుత్వ లోటుపాట్లను ఎత్తిచూపేందుకే దీక్షలు
ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల తెలంగాణ ప్రజలపై తీరని భారం పడనుంది. ఎత్తిపోతల పథకాల ద్వారా ఏటా రూ. వేల కోట్ల వడ్డీలు, కరెంట్‌ బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు, పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేయాలన్న డిమాండ్‌తో జలదీక్షలు చేయనున్నాం. జూన్‌ 2న కృష్ణా ప్రాజెక్టుల వద్ద, 6న గోదావరి ప్రాజెక్టుల వద్ద పార్టీ నేతలు, శ్రేణులు దీక్షలు చేస్తారు. గ్రావిటీ ద్వారా కృష్ణా నీటిని తీసుకొచ్చే ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ వద్ద ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీనియర్‌ నేత జానారెడ్డితో కలసి నేను దీక్షలో కూర్చుంటా. పాలమూరు ప్రాజెక్టులోని లక్ష్మీదేవునిపల్లి వద్ద ఎంపీ రేవంత్‌రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, కల్వకుర్తి వద్ద వంశీచంద్‌రెడ్డి, ఎల్లూరు వద్ద నాగం జనార్దన్‌రెడ్డి, నెట్టెంపాడు వద్ద సంపత్, కర్వెన వద్ద చిన్నారెడ్డి దీక్షలో కూర్చుంటారు.