https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/05/26/coro.jpg?itok=u7frhm8p

4 వేలు దాటిన మరణాలు



న్యూఢిల్లీ:   దేశంలో కరోనా కాఠిన్యం కొనసాగుతూనే ఉంది. పాజిటివ్‌ కేసులు అనూహ్యంగా పెరిగిపోతున్నాయి. మరణాల సంఖ్య 4 వేలు దాటేసింది. వరుసగా నాలుగో రోజు రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు.. ఒక్కరోజు వ్యవధిలోనే 6,977 కేసులు బయటపడ్డాయి. ఇండియాలో ఇప్పటిదాకా ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. గత 24 గంటల్లో 154 మంది కరోనా బాధితులు కన్నుమూశారు.

ఇప్పటివరకు మొత్తం పాజిటివ్‌ కేసులు 1,38,845కు, మరణాలు 4,021కు చేరాయని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. దేశంలో ప్రస్తుతం కరోనా యాక్టివ్‌ కేసుల సంఖ్య 77,103. కరోనా బారినపడిన వారిలో 57,720 మంది చికిత్సతో పూర్తిగా కోలుకున్నారు. అంటే రికవరీ రేటు 41.57 శాతానికి పెరిగినట్లు స్పష్టమవుతోంది. కరోనా దెబ్బతో మహారాష్ట్ర వణికిపోతోంది. ఇప్పటిదాకా ఈ మహమ్మారి వల్ల దేశంలో 4,021 మంది మరణించగా, ఇందులో 1,635 మరణాలు మహారాష్ట్రలోనే సంభవించాయి.  

రైల్‌ భవన్‌లో మరో ఉద్యోగికి కరోనా  
రైల్వేశాఖ ప్రధాన కార్యాలయం రైల్‌ భవన్‌లో పని చేస్తున్న ఓ ఉద్యోగికి తాజాగా కరోనా సోకింది. ఇదే భవనంలో కేవలం రెండు వారాల లోపే ఐదుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడం కలకలం సృష్టిస్తోంది. మే 19వ తేదీ దాకా విధులకు హాజరైన నాలుగో తరగతి ఉద్యోగికి కరోనా సోకినట్లు సోమవారం వెల్లడైంది. అతడితో కాంటాక్టు అయిన తొమ్మిది మందిని అధికారులు హోం క్వారంటైన్‌కు తరలించారు. ఒక అధికారి నుంచి మరో అధికారి వద్దకు ఫైళ్లను తీసుకెళ్లడమే ఈ నాలుగో తరగతి ఉద్యోగి పని. ఈ ఫైళ్లు రైల్వే బోర్డు చైర్మన్‌తోపాటు రైల్వేశాఖ మంత్రిదాకా వెళ్తుంటాయి. దీంతో అతడిద్వారా ఇంకెవరికైనా కరోనా సోకిందా అనే ఆందోళన వ్యక్తమవుతోంది. వరుసగా కరోనా కేసులు బయటపడుతుండడంతో పూర్తిస్థాయిలో శానిటైజేషన్‌ చేయడానికి రైల్‌ భవన్‌ను మే 14, 15వ తేదీల్లో మూసివేశారు. ఇప్పుడు నాలుగో తరగతి ఉద్యోగికి కరోనా రావడంతో రైల్‌ భవన్‌ను మే 26, 27 తేదీల్లో మూసివేయాలని నిర్ణయించారు.