https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/05/26/111.jpg?itok=9BQloF9t

కించపరిచినవారే కితాబిస్తున్నారు!



సాక్షి, అమరావతి: ఎన్నో సంక్షేమ పథకాలను పేదలకు అందించడం ఆనందంగా ఉందని, ఇందుకు కారణం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అని గ్రామ సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు పేర్కొన్నారు. అవ్వా తాతలు నిత్యం సీఎం జగన్‌ను తలుచుకుంటున్నారని, వలంటీర్ల వ్యవస్థను కించపరిచిన వారే ఇప్పుడు సేవలందుకుంటున్నారని చెప్పారు. తమ ఇంటికి వలంటీర్లు వస్తున్నారంటే ముఖ్యమంత్రి జగన్‌ ఏదో పథకం ద్వారా లబ్ధి చేకూర్చేందుకు పంపిస్తున్నట్లు జనం భావిస్తున్నారని చెప్పారు. ‘మన పాలన– మీ సూచన’ కార్యక్రమంలో సోమవారం సీఎం జగన్‌ ప్రసంగించిన అనంతరం వలంటీర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగులు, లబ్ధిదారులు మాట్లాడారు. వివరాలు వారి మాటల్లోనే...

మీరున్నారనే ధైర్యం..
సచివాలయ వ్యవస్థలో దాదాపు 4.5 లక్షల మంది ఉద్యోగులుంటే 50 శాతం మహిళలకే ఇచ్చినందుకు సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం. మొదట్లో వలంటీర్లను కొందరు చిన్నచూపు చూశారు. ఇవాళ దేశమంతా మావైపు చూస్తోంది. కొన్నిసార్లు మనోవేదనకు గురైనా మా వెనక ముఖ్యమంత్రి ఉన్నారనే ధైర్యంతో ముందుకు వెళ్లాం. 
–స్మైలి,  వెంకటాయపాలెం. సచివాలయం

దిశ ధైర్యానిచ్చింది...
దిశ చట్టం వచ్చాక 2 కేసుల్లో ఉరిశిక్ష విధించారు. గతంలో మహిళలు పగలు కూడా బయట తిరగలేని పరిస్థితి ఉంది. ‘దిశ’ ఎంతో ధైర్యం ఇచ్చింది. మీ చర్యలతో మద్యపానం తగ్గింది. నేరాలు తగ్గాయి. 
–శ్రావణి, విజయవాడ, మహిళా పోలీస్‌

ఎప్పటికీ మరవలేం..
నా భర్త ఆటో డ్రైవరు. నేను టైలరింగ్‌ పని చేస్తా. మా పెద్దబ్బాయికి పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వచ్చింది. నా చిన్న కొడుక్కి ఇప్పటికే రూ.10 వేలు ఇచ్చారు. నా కూతురు కస్తూరిబా స్కూల్‌లో చదువుతోంది. మీ మేలు మరణించేదాకా మరువలేం. మీకు కృతజ్ఞతలు.
–నారాయణమ్మ, లబ్దిదారు, కర్నూలు

రుణపడి ఉంటాం...
మీ పుట్టిన రోజు నాడు ధర్మవరం వచ్చి నేతన్న నేస్తం పథకాన్ని ప్రారంభించారు. అందుకు మీకు రుణపడి ఉంటాం. ఒక ఇంట్లో ఉండే చేనేత కార్మికులందరికీ సాయం చేయండి. ఇవాళ లంచం లేకుండా పెన్షన్లు ఇస్తున్నారు. పథకాలు అందుతున్నాయి.    
– ఫర్జాన, వార్డు వలంటీర్, ధర్మవరం. అనంతపురం 

ఏది కావాలన్నా అందుతోంది..
ఏదైనా సమస్య వస్తే ఎలా పరిష్కరించుకోవాలో ప్రజలకు గతంలో సరిగా తెలిసేది కాదు. నాదీ అదే పరిస్థితి. సచివాలయాల ద్వారా ఏం కావాలన్నా చేసి పెడుతున్నాం. ఏది కావాలన్నా 72 గంటల్లోనే పరిష్కరిస్తున్నారు. కేవలం పార్టీ కార్యకర్తలకే ఉద్యోగాలు ఇచ్చారని దుష్ప్రచారం చేశారు. అందులో వాస్తవం లేదు. అందుకే నాకు ఈ ఉద్యోగం వచ్చింది.
    – నాగలక్ష్మి, వలంటీర్, కాకినాడ రూరల్‌ మండలం. తిమ్మాపురం.

ఇంటింటా ఆనందమే..
గతంలో మమ్మల్ని ఎగతాళి చేసిన వారే ఇవాళ పనులు చేసి పెట్టాలని కోరుతున్నారు. మా వెనక ఉన్న ‘రియల్‌ హీరో’ మీరు. ఇంటింటికీ వెళ్లి పెన్షన్లు అందిస్తుంటే ఎంతో సంతోషంగా మీరు, మీ ప్రభుత్వం కలకాలం ఉండాలని కోరుతున్నారు.
–హేమంత్‌రెడ్డి, విజయవాడ. వలంటీర్‌

ఆదుకున్న సున్నా వడ్డీ డబ్బులు
మా సంఘానికి సున్నా వడ్డీతో రూ.28 వేలు వచ్చాయి. అది కూడా కరోనా సమయంలో వచ్చాయి. కిరాణ సరుకులు తెచ్చుకున్నాం. జగనన్నకు రాష్ట్ర ప్రజల మీదే ప్రేమ అనుకున్నాం. ఇతర రాష్ట్రాల నుంచి వలస కూలీలను రప్పించడమే కాకుండా, ఇక్కడ ఉన్న వలస కూలీలను క్షేమంగా పంపించారు. మా పిల్లల సమయంలో కూడా మీరే ముఖ్యమంత్రిగా ఉండాలి.
    – కుసుమకుమారి, తూర్పు గోదావరి

కష్టాలు తీరాయి..
మీరు మాకు రూ.10 వేలు ఇచ్చినందుకు ఎంతో సంతోషం. దీనివల్ల మా కష్టాలు తీరాయి. మాకోసం ఇంకా ఎన్నెన్నో చేస్తున్నారు. అందుకు ఎంతో రుణపడి ఉంటాం.
– లీలా కృష్ణ, ఏలూరు–ఆటో డ్రైవర్ల సంఘం నాయకుడు

ఆ గౌరవం మీకే దక్కాలి..
కోవిడ్‌ సమయంలో పోర్టబులిటీ ద్వారా ఎవరు ఎక్కడ ఉన్నా పింఛను ఇవ్వడం నిజంగా చాలా గొప్ప పని. లబ్ధిదారులు మాకిస్తున్న గౌరవం, అభిమానం అంతా మీకే  దక్కాలి.
    – సరోజ, గుంటూరు కార్పొరేషన్, సంక్షేమ కార్యదర్శి

ప్రార్థనలు ఫలించాయి..
మిమ్మల్ని సీఎంగా చూడాలని ఎన్నో ప్రార్థనలు చేశాం. ఇవాళ మీరు చేస్తున్న కార్యక్రమాలు గతంలో ఎవరూ చేయలేదు. ఎక్కడా వివక్ష లేకుండా పథకాలు అమలు చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో నాకు రూ.3 లక్షల రుణం మంజూరైతే వైఎస్సార్‌సీపీ మద్దతుదారునని తొలగించారు. 
    – శైలజ, లబ్ధిదారు నెల్లూరు జిల్లా

వలంటీర్ల సేవలు బాగున్నాయి..
గ్రామ స్వరాజ్య నిధి ఏర్పాటు చేసి, 20 ఏళ్ల నుంచి గ్రామానికి కావాల్సిన అవసరాలు కేవలం వడ్డీతో తీరుస్తున్నాం. ఇప్పుడు గ్రామాల సమస్యలు పరిష్కారం కాగా, వేరే ఊళ్ల సమస్యలు కూడా తీరుస్తున్నారు. ఇవాళ మీరు గ్రామస్థాయిలో కూడా పరిపాలనలో మార్పు చేస్తూ, సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేశారు. వలంటీర్లను నియమించారు. కోవిడ్‌ సమయంలో వారు ఎంతో సేవలందించారు. అది కళ్లారా చూశాం. గ్రామస్థాయిలో మార్పులు రావలంటే అధికారంతో పాటు, నిధులు కూడా కావాలి. అవి ఉంటే తప్ప ఆ ఉత్సాహం, బాధ్యత వస్తాయి. అప్పుడే మార్పు కూడా సాధ్యం. 
    – మాంఛో  ఫెర్రర్, ఆర్‌డీటీ. అనంతపురం

ఈ సందర్భంగా మరోసారి మాట్లాడిన సీఎం, అనంతపురం జిల్లాలో ఫెర్రర్‌ కుటుంబం స్థాపించిన ఆర్‌డీటీ గురించి తెలియని వారెవరూ ఉండరని, ఆ కుటుంబం ఎంతో సేవ చేస్తోందని చెప్పారు.

సంక్షేమ పాలన..
‘సంక్షేమ పాలన ద్వారా ఇప్పటి వరకు అణగారిన వర్గాలుగా ఉన్న వారు కూడా పాలకులవుతారు. వారి చేతుల్లో అధికారం పెట్టడం జరుగుతుంది. ప్రజల్లో చైతన్యం వస్తే గ్రామం బాగు పడుతుంది. గ్రామాలు బాగు పడితేనే మండలాలు, తద్వారా జిల్లాలు, రాష్ట్రం బాగు పడుతుంది.మీకు ఎవరు ఆలోచన ఇస్తున్నారో తెలియదు. చాలా చక్కగా పని చేస్తున్నారు.  జగనన్న ప్రభుత్వం వచ్చింది కాబట్టి, పని చేయక తప్పదు అని అందరూ భావిస్తున్నారు.     
    – మల్లారెడ్డి, అనంతపురం

మేనమామలా ఆదుకున్నారు..
నాకు ఇద్దరు బిడ్డలు. ఏ అండా లేదు. మీరు  మా పిల్లలకు మేనమామలా నిల్చి ఆదుకున్నారు. అమ్మ ఒడి ద్వారా డబ్బులు వస్తున్నాయి. ఇన్ని చేస్తూ కూడా మాలాంటి పేదలకు ఇంటి స్థలంతోపాటు ఇంటిని కూడా నిర్మించి ఇస్తానన్నారు. ఇలా గతంలో ఎవరూ చేయలేదు. అన్నా రాఖీ కడతా.
    – శ్రీలక్ష్మి, లబ్ధిదారు,గుంటూరు