పారితోషికంకాదు.. పార్టనర్‌షిప్!
‘నరసింహా, ముత్తు, దశావతారం, జై సింహా’ వంటి భారీ సినిమాలను డైరెక్ట్ చేసిన తమిళ దర్శకుడు కేయస్ రవికుమార్ ఓ చిన్న బడ్జెట్ సినిమాను తెరకెక్కించబోతున్నారు. సత్యరాజ్ ముఖ్య పాత్రలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఆర్‌బీ చౌదరి నిర్మించనున్న ఈ సినిమా బడ్జెట్ 2 కోట్ల వరకూ ఉంటుంది. విశేషమేంటంటే... ఈ సినిమాకు పని చేసే నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎవరూ పారితోషికం తీసుకోవడంలేదట. ఈ సినిమా బిజినెస్ పూర్తయిన తర్వాత వాటా తీసుకుంటారట.
ఈ సినిమా చిత్రీకరణను 30 రోజుల్లో పూర్తి చేయాలన్నది ప్లాన్ అని తెలిసింది. ఇందులో తమిళ నటులు విజయ్ సేతుపతి, పార్థిబన్ ముఖ్య పాత్రల్లో నటించనున్నారు. షూటింగ్‌లకు అనుమతి ఇవ్వగానే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. పెద్ద స్టార్స్, డైరెక్టర్స్ ఇప్పటికే పార్టనర్‌షిప్ మీదే సినిమాలు చేస్తున్నారు. కరోనా తర్వాత చిన్న సినిమాలు కూడా పారితోషికాలు కాకుండా పార్టనర్‌షిప్ ప్లాన్‌తో రూపొందుతాయా? యాక్టర్స్, డైరెక్టర్స్ పారితోషికం బదులు భాగస్వామ్యం తీసుకుంటారా? వేచి చూడాలి.