https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/05/26/Cyber.jpg?itok=fgGpRxws

రూపాయి ఎర వేసి... ఖాతా ఖాళీ చేసి!



ఓ ప్రైవేటు సంస్థను నడుపుతున్న కె.పవిత్ర బ్యాంకు ఖాతాలో ఈ నెల 21న అపరిచిత వ్యక్తి ఖాతా నుంచి రూ.1 జమ అయ్యింది. మరుక్షణమే ఆ అపరిచిత వ్యక్తి తిరిగి రూ.1 రివర్స్‌ చేసుకున్నాడు. ఇలా నాలుగుసార్లు వేసి.. తీసిన తర్వాత ఒక్కసారిగా రూ.7,900 డ్రా చేశాడు. మళ్లీ అదే పనిగా మరో రూ.1,100ను నాలుగు దఫాలుగా విత్‌డ్రా చేశాడు. అయితే ఖాతాదారుకు మాత్రం ఎలాంటి సమాచారం రాలేదు. అపరిచిత వ్యక్తి నుంచి ఫోన్‌ కాల్, మెసేజ్‌ ఏదీ లేదు. ఏదో అవసరం మీద తన ఖాతాలో నగదును పరిశీలిస్తే.. ఈ విత్‌డ్రా పర్వం వెలుగు చూసింది. వెంటనే ఎల్‌బీ నగర్‌లోని సైబర్‌ క్రైమ్‌ విభాగంలో, తర్వాత బ్యాంకులో ఫిర్యాదు చేయగా... తమ పొరపాటు కాదని బ్యాంకర్లు చేతులెత్తేయడం గమనార్హం. తన ప్రమేయం లేకుండా, కనీసం తన పొరపాటు లేకుండా నగదు పోవడంతో ఆమె బ్యాంకు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

సాక్షి, హైదరాబాద్‌: సైబర్‌ నేరాలు మితిమీరిపోతున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం విస్తృతమవుతున్న తరుణంలో నేరగాళ్లు ఇదే పరిజ్ఞానంతో నేరాలకు పాల్పడుతున్నారు. ఇప్పటివరకు బ్యాంకు ఖాతాలో నగదు తస్కరించడమంటే అపరిచిత వ్యక్తుల నుంచి ఫోన్‌ కాల్‌ ద్వారా ఏటీఎం వివరాలు అడగడమో, లేక ఎస్‌ఎంఎస్‌లు పంపమనడమో, ఏదో లింక్‌ పంపి క్లిక్‌ చేయమనడమో జరిగేది. అలా అవతలి వ్యక్తులు వివరాలు తీసుకున్న తర్వాత ఖాతాలో నగదు స్వాహా చేయడం విన్నాం. కానీ ఎలాంటి ఫోన్‌ కాల్స్, ఎస్‌ఎంఎస్‌ లేకుండా ఖాతాలోని నగదును సైబర్‌ నేరగాళ్లు కొల్లగొడుతున్నారు. తాజాగా సైబర్‌ క్రైమ్‌ విభాగానికి ఇలాంటి కేసులు అధికంగా వస్తున్నాయి. గత వారం సంగారెడ్డిలోని ఓ టీచరు ఖాతా నుంచి ఏకంగా 20వేలు ఇలా మాయమయ్యాయి.

ఇన్సూరెన్స్‌తో కవరేజీ... 
బ్యాంకు ఖాతాలో నగదుపోతే వెంటనే బ్యాంకర్‌కు ఫిర్యాదు చేయాలి. వారి సూచనల ఆధారంగా.. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన తర్వాత ఏటీఎం కార్డుకు ఇన్సూరెన్స్‌ ఉంటే పొగొట్టుకున్న మొత్తం తిరిగి పొందే వీలుంటుంది. అయితే ఈ ప్రక్రియ అంత సులువేం కాదు. ఫిర్యాదు అనంతరం కార్డుదారు డాటాను పూర్తిగా పరిశీలించిన తర్వాత ఖాతాదారు పొరపాటు లేదని గ్రహిస్తేనే ఇన్సూరెన్స్‌ వస్తుంది. ఖాతాదారు తన వివరాలను అపరిచిత వ్యక్తులతో పంచుకుంటే లేదా నగదు పొగొట్టుకోవడంలో తన ప్రమేయం ఉంటే ఇన్సూరెన్స్‌ వర్తించదని బ్యాంకర్లు స్పష్టం చేస్తున్నారు. ఈనెల 21న కె. పవిత్ర ఖాతాలో రూ.9వేలు స్వాహా కావడంపై బ్యాంకులో ఫిర్యాదు చేయడంతో పాటు తన ప్రమేయం లేకుండా నగదు విత్‌డ్రా చేయడంపై ఆమె బ్యాంకర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కేసు నమోదు చేసుకుని ఇన్సూరెన్స్‌ వివరాలను పరిశీలిస్తామని హామీ ఇవ్వడంతో వివాదం కాస్త సద్దుమణిగింది.

అప్రమత్తత లేకుంటే అంతే
బ్యాంకు ఖాతాలో నగదు తస్కరించడం అంత సులువైన విషయం కాదు. ఖాతా వివరాలు తెలిసి ఉండటంతోనే ఇది సాధ్యమవుతుందని అధికారులు చెబుతున్నారు. బ్యాంకు ఖాతా వివరాలు లేదా ఏటీఎం కార్డు నంబర్‌తో పాటు సీవీవీ నంబర్లు తెలిస్తే చాలు మన ఖాతాలో నిల్వలు కొట్టేయొచ్చు. ఏటీఎంలో నగదు డ్రా చేసిన తర్వాత వచ్చే స్లిప్పు ఆధారంగా కూడా తస్కరించవచ్చు. బ్యాంకు ఖాతా, ఏటీఎం వివరాలు ఇతరులకు ఇవ్వొద్దనే దానిపై ఖాతాదారుల్లో కొంత అవగాహన పెరిగింది.

ఈక్రమంలో సైబర్‌ నేరగాళ్లు కొత్త టెక్నాలజీ ద్వారా నేరాలకు పాల్పడుతున్నారు. దీనిపై ప్రతి ఖాతాదారు జాగ్రత్తగా ఉండాల్సిందే. ఏటీ ఎంలలో నగదు విత్‌డ్రా, ఇతర షాపింగ్‌ మాల్స్‌ లేదా దుకాణాల్లో సరుకులు కొనుగోలు చేశాక డెబిట్‌/క్రెడిట్‌ కార్డు ద్వారా జరిగే లావాదేవీలు పూర్తయ్యే వరకు వేచి చూడాలని, లేకుంటే ఖాతా నిర్వహణ సై బర్‌ నేరగాళ్ల చేతిలోకి వెళ్లే అవకాశం ఉంద ని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా మేనేజర్‌ పాతూరి వెంకటేశ్‌ గౌడ్‌ ‘సాక్షి’తో పేర్కొన్నారు.