ఒంటరినైపోయినట్లు అనిపించింది
సుమారు నాలుగు దశాబ్దాలు (1960 నుంచి 2000వరకూ) సినిమాలు చేస్తూ బిజీబిజీగా జీవితాన్ని గడిపారు ప్రఖ్యాత బాలీవుడ్ నటుడు జితేంద్ర. ఆ తర్వాత సినిమాలు తగ్గించారు. సినిమాలు తగ్గించాక ‘ఒంటరినైపోయినట్లు అనిపించింది’ అన్నారు. 2013 నుంచి ఆయన సినిమాల్లో నటించలేదు. చాలా గ్యాప్ తర్వాత ఓ వెబ్ సిరీస్ (బారిష్ 2) చేశారు. ఈ సిరీస్‌తోనే వెబ్ వరల్డ్‌లోకి అడుగుపెడుతున్నారు. ఈ సిరీస్‌ను జితేంద్ర కుమార్తె ఏక్తా కపూర్ నిర్మించారు.
నటుడిగా ఇన్నేళ్లు గ్యాప్ తీసుకోవడం గురించి, సినిమాలు చేయకపోవడం గురించి జితేంద్ర మాట్లాడుతూ – ‘‘సినిమాలు తగ్గించాక నటించడాన్ని పెద్దగా మిస్ అయినట్టు అనిపించలేదు కానీ, షూటింగ్ వాతావరణాన్ని బాగా మిస్ అయ్యాను. . ఒకేసారి రెండుమూడు సినిమాలు చేస్తుండేవాళ్లం. ఉదయం నుంచి రాత్రి వరకూ స్టూడియోలోనే ఉండేవాళ్లం. సెట్లో ఎప్పుడూ సందడి ఉండేది. లొకేషన్లోకి అడుగుపెట్టగానే చాలా మంది కనిపించేవారు. అందరితో మాట్లాడటం, అనుభవాలు పంచుకోవడం.. అలా చుట్టూ మనుషులతో టైమ్ ఎలా గడిచిపోయేదో తెలిసేది కాదు. ఆ వాతావరణాన్ని బాగా మిస్ అయ్యాను. ఇప్పుడు డిజిటల్ ప్రపంచంలోకి అడుగుపెట్టడం ఓ కొత్త అనుభవం ’’ అన్నారు.