https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/05/26/satyanarayana-reddy.jpg?itok=_XjQ8sit

‘టెన్త్‌’ కొత్త కేంద్రాలపై మెసేజ్‌లు



సాక్షి, హైదరాబాద్‌ : కరోనా జాగ్రత్తల్లో భాగంగా పదో తరగతి పరీక్షల కోసం ఏర్పాటు చేసిన కొత్త పరీక్ష కేంద్రాల సమాచారాన్ని విద్యార్థులు, వారి తల్లిదండ్రుల సెల్‌ఫోన్లకు ఎస్‌ఎంఎస్‌లు, వాట్సాప్‌ మెసేజ్‌ల రూపంలో పంపనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభా గం డైరెక్టర్‌ ఎ.సత్యనారాయణరెడ్డి తెలిపారు. సెల్‌ఫోన్లు లేని, ఫోన్ల ద్వారా సమాచారం అందని వారి కోసం పాత పరీక్ష కేంద్రాల వద్ద సహాయకులను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. పరీక్ష కేంద్రాల ఏర్పాటు, విద్యార్థుల కోసం చేపడుతున్న చర్యలపై సత్యనారాయణరెడ్డి ‘సాక్షి’తో మాట్లాడారు. ఆయన వెల్లడించిన వివిధ అంశాలు...

విద్యార్థులకు మాస్కులు, శానిటైజర్లు
పరీక్షల ముందు రోజు విద్యార్థులు, తల్లి దండ్రులు పాత పరీక్ష కేంద్రానికి వెళ్లి వివరాలను చూసుకుంటే పరీక్ష ప్రారంభం రోజున ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. పాత కేంద్రాల్లో ఏ హాల్‌టికెట్‌ నంబర్‌ నుంచి ఏ హాల్‌టికెట్‌ నంబర్‌ వారికి సెంటర్‌ ఉంది.. మిగతా వారికి సమీపంలోని ఏ భవనంలో అదనంగా కొత్త సెంటర్‌ను ఏర్పాటు చేశామన్న వివరాలు తెలుసుకోవచ్చు. జూన్‌ 7నే ఆ వివరాలను పాత కేంద్రాల వద్ద నోటీసు బోర్డుల్లో అందుబాటులో ఉంచుతాం. గంట ముందే పరీక్ష కేంద్రంలోకి విద్యార్థులను అనుమతిస్తాం కాబట్టి విద్యార్థులు అదే రోజు వెళ్లినా సమీపంలోని (కిలోమీటర్‌ పరిధిలోపే) కొత్త కేంద్రం వివరాలు పొందవచ్చు. ఆ వివరాలను తెలియజేసేందుకు సహాయకులను నియమిస్తాం. పాత కేంద్రం నుంచి కొత్త కేంద్రానికి వెళ్లే క్రమంలో మొదటిరోజు కొద్దిగా ఆలస్యమైనా అనుమతిస్తాం. విద్యార్థుల ప్రత్యక్ష తనిఖీ (ఫ్రిస్కింగ్‌) ఉండదు. పరీక్ష కేంద్రంలో విద్యార్థులకు శానిటైజర్లు, మాస్క్‌లు అందజేస్తాం. విద్యార్థులూ వాటిని తెచ్చుకోవచ్చు. మంచినీళ్ల బాటిళ్లను కూడా అనుమతిస్తాం. పరీక్ష కేంద్రాలన్నింటినీ కెమికల్‌తో శానిటైజ్‌ చేస్తాం.

పక్కాగా జాగ్రత్తలు..
పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే 5,34,903 మంది విద్యార్థులకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించేందుకు పక్కా చర్యలు చేపడుతున్నాం. విద్యార్థులు ఏ దశలోనూ ఇబ్బంది పడకుండా అన్ని జాగ్రత్త చర్యలు చేపడుతున్నాం. హైకోర్టు ఆదేశాల మేరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే డీఈవోలకు ఆదేశాలు జారీ చేశాం. కరోనా నేపథ్యంలో భౌతికదూరం పాటించేలా ఒక బెంచీపై ఒకరే కూర్చొని పరీక్షలు రాసేలా చర్యలు చేపట్టిన నేపథ్యంలో పరీక్ష కేంద్రాలను పెంచాం. పాత కేంద్రాలు 2,530 ఉండగా మరో 2,005 కేంద్రాలను గుర్తించాం. అవసరమైతే ఇంకా కేంద్రాలను పెంచాలని డీఈవోలను ఆదేశించాం. స్కూళ్లల్లోని అదనపు గదులను వినియోగించుకోవడంతోపాటు కాలేజీల భవనాలు, ఫంక్షన్‌ హాళ్లు, ఆడిటోరియాలను తీసుకొని పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించాం. భౌతికదూరం పాటించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రతి 20 స్కూళ్లకు కలిపి ఒక జోన్‌గా చేశాం. అందులో నాలుగు సెంటర్లు ఉన్నాయి. ఇప్పుడు కూడా ఆయా జోన్లలో వాటికి సమీపంలోని (కిలోమీటర్‌ లోపే) భవనాల్లోనే అదనపు కేంద్రాలు ఏర్పాటు చేస్తాం.

కంటైన్మెంట్‌ జోన్లలో ఎక్కువ మంది ఉంటే ప్రత్యేక కేంద్రం..
ప్రస్తుతం రాష్ట్రంలో కంటైన్మెంట్‌ జోన్లు తక్కువే ఉన్నాయి. హోం క్వారంటైన్‌లో సంబంధిత ఇళ్లు, అపార్ట్‌మెంట్లు ఉన్నాయి. జూన్‌ ఒకటో తేదీ వరకు చూస్తాం. ఆలోగా హోం క్వారంటైన్‌లో ఉన్న ఇళ్లు, అపార్ట్‌మెంట్లలోని పిల్లలు ఎవరైనా ఉన్నారా? కంటైన్మెంట్‌ జోన్లలో విద్యార్థులు ఎంత మంది ఉంటారన్న లెక్కలు తీస్తున్నాం. కంటైన్మెంట్‌ జోన్‌ నుంచి వచ్చే విద్యార్థులు తక్కువ మంది ఉంటే వారికి ప్రత్యేక గదులను కేటాయించి పరీక్షలు రాసేలా ఏర్పాట్లు చేస్తాం. ఒకవేళ కంటైన్మెంట్‌ జోన్లలో ఎక్కువ మంది పిల్లలు ఉంటే అక్కడే ప్రత్యేక పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహిస్తాం. పరీక్షలకు వచ్చే వారిలో ఎవరికైనా దగ్గు, జలుబు, జ్వరం వంటివి ఉంటే వారికి ప్రత్యేక గదుల్లో పరీక్షలు నిర్వహిస్తాం.