https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/05/26/thripuraneni.jpg?itok=QQZ_I6Tp
త్రిపురనేని రామస్వామి

కొనసాగుతున్న ‘శంబుకవధ’లు



సామాజిక వివక్షను నిరసించి, సాంఘిక సమానత్వాన్ని పాదుగొల్పే కృషిలోనే అగ్రవర్ణ పాలకుల కత్తివేటుకు బలైపోయిన వాడికథే శంబుక రిషి వధ. నేడు శతజయంతి జరుపుకుంటున్న తెలుగుజాతి వైతాళికులలో అగ్రశ్రేణికి చెందిన కవిరాజు త్రిపురనేని రామస్వామి రచన ‘శంబుక వధ’! అది శంబుకుని వధే కాదు, సామాజిక న్యాయం కోసం, వర్ణవివక్షా చట్రంలో దాగుడుమూతలాడుతూ వచ్చిన ఆనాటి రాచరిక వర్గానికి బాసటగా నిలిచిన అగ్రవర్ణ కుట్రలకు దాసోహమన్న పాలకుల కథే ‘శంబుక వధ’

‘దళితజాతులకు శతాబ్దాల తరబడిగా విద్యార్జన హక్కును నిరాకరిస్తూ రావడం జరి గింది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ అంబే డ్కర్‌ కృషిఫలితంగా వారికి విద్యార్జన హక్కు అనేది రాజ్యాంగంలో పొందుపర్చడం వల్ల సంక్రమించింది. కానీ ఆ హక్కును అణగారిన వర్గాలు అనుభవించకుండా ఆచరణలో నేటి వరకు వారిని ప్రత్యక్షంగా, పరోక్షంగా నిరంతర వేధింపులకు, అవమానాలకు గురి చేస్తూనే ఉన్నారు.’ 
– యధాయ చత్రన్‌ : వైర్‌ ఇంటర్వ్యూ (25–07–2019)

ఈ ఇంటర్వ్యూ వెలువడి ఏడాది కూడా గడవకముందే దేశంలోని కులవ్యవస్థ ఎంతో పైకి రావలసిన 26 ఏళ్ల వైద్యవిద్యార్థిని పాయల్‌ తద్వీని బలితీసుకుందని ఆమె తల్లిదండ్రులు అబీదా తద్వీ, సలీం తద్వీ ప్రకటించారని మరవరాదు. ఇంతకూ వీళ్లెవరు? ఆదివాసీ తెగ లలో ఒకటైన భిల్‌ తెగకు చెందిన కుటుంబం నుంచి ఎండీ విద్యా స్థాయికి వచ్చిన 26 సంవత్సరాల విద్యార్థిని పాయల్‌ చేసిన తప్పే మిటి? రాజ్యాంగం ప్రకారం మెడిసిన్‌లో ఆమెకు సీటు రావడం! కానీ పాయల్‌కు దక్కిన అవకాశం చూసి ఓర్వలేక అగ్ర కులానికి చెందిన ముగ్గురు మహిళా డాక్టర్లు పాయల్‌ను వేధించి ఆమెను చిత్రహింసల పాలు చేసి ఆమె ఆత్మహత్యకు కారకులయ్యారు. కానీ ఆ మహిళా డాక్టర్లను జైలుకు పంపిన వ్యవస్థ అంత త్వరగానూ కొద్దిరోజులకే వారిని విడుదల చేసింది. ఈ విషాదానికి కుమిలి పోయిన తల్లి అబీదా తద్వీ, సలీమ్‌లు ‘మా బిడ్డ మా కళ్లలో సదా సజీవురాలిగానే ఉంటుంది. ఆమె విద్యార్జన కోసం పడిన కష్టనష్టాలు నిరంతర పోరాటం వృథా కావు. మా బిడ్డకోసమే కాదు, మా బిడ్డ లాంటి ఇతర బిడ్డల భవిష్యత్తు కోసమూ నిరంతరం మేం పోరాడుతూనే ఉంటాం’ అని ప్రకటించారు. అంతేకాదు, ఈ దంపతులు మరొక లేఖను విడు దల చేస్తూ, ప్రభుత్వమూ, న్యాయస్థానాలూ కూడా ఇలాంటి కేసుల విషయంలో తాత్సారం చేస్తున్నాయని ఆరోపించారు. ఈ అశ్రద్ధ వల్ల పెద్ద పెద్ద విద్యాసంస్థల్లో ఈ క్షణం దాకా బహుజన విద్యార్థులపై అత్యాచారాలు, వేధింపులు కొనసాగుతున్నాయని తీవ్ర నిరసనను ప్రకటించారు.

సామాజిక వివక్షను వాచ్యంగా నిరసించే శిక్షాస్మృతులు పేరుకు రూపం మార్చుకుంటూ ఉంటాయే కానీ, దళిత వర్గాలను పీడకులు పీడించకుండా ఆగడం లేదని వారు ఆగ్రహం ప్రకటించాల్సి వచ్చింది. సరిగ్గా ఈ సామాజిక వివక్షను నిరసించి, సాంఘిక సమానత్వాన్ని పాదుకొల్పే కృషిలోనే అగ్రవర్ణ పాలకుల కత్తివేటుకు బలైపోయిన వాడికథే రామాయణ కాలం నాటి శంబుక రిషి వధ. అదే నేడు శతజయంతి జరుపుకుంటున్న తెలుగుజాతి వైతాళికులలో అగ్రశ్రేణికి చెందిన కవి రాజు త్రిపురనేని రామస్వామి ‘శంబుక వధ’..! అది శంబుకుని వధే కాదు, సామాజిక న్యాయం కోసం, వర్ణవివక్షా చట్రంలో దాగుడుమూతలాడుతూ వచ్చిన ఆనాటి రాచరిక వర్గానికి బాసటగా నిలిచిన అగ్రవర్ణ కుట్రలకు దాసోహమన్న పాలకుల కథే ‘శంబుక వథ’ నాటకం. వేమన, గురజాడ మహాకవులలో ఉన్న హేతు వాద, మానవతావాదమే రామస్వామి కలం కవాతును వేయిన్నొక్క విధులుగా తీర్చిదిద్దింది. హేతువు ఆధారపడిన ప్రశ్న పరంపర ఆయన కలం నుంచి కురిపించిన శరపరంపరలెన్నో. తెలుగువారి మేలుకొలు పులకు, తద్వారా సామాజిక చైతన్యంతో వారిని ముందుకు నడిపించ డానికి తోడునీడై నిలిచిన రచనలు ‘శంబుక వధ’కు తోడు సూత పురాణం, భగవద్గీత, ఖూనీ రచనలు. ఇవన్నీ తెలుగునాట భావ విప్లవానికి దారితీసిన ఉద్దీపనలే. రామాయణ కథానాయకుడైన పాలక చక్రవర్తి రాముడు.. రిషి, శాంతస్వభావుడైన శంబుకుడిని చంపడానికి కారణం ఏమిటి? నాటి రాచరిక వ్యవస్థకు (ఈనాటి ఆధునిక పాలక చక్రవర్తులకు) సలహాదారుగా నిప్పు రాజేసే తగవులమధ్యనే తమ పనులు చక్క దిద్దుకునే ఏదో ఒక అగ్రవర్ణం ఉన్నంతకాలం– సర్వులకు సమాన ఫాయాలో సామాజిక న్యాయం వాయిదా పడుతూనే వస్తుం దన్నది శంబుక రిషి అనుభవం. అక్కడికీ శంబుకుడు నిరపరాధి, శాంత స్వభావుడు, సామాజిక న్యాయం కోసం పోరాడుతున్నాడని రాముడికి తెలుసు, ఒప్పుకున్నాడు కూడా.

భవభూతి ‘ఉత్తర రామచరిత’ సాక్ష్యం ఉండబట్టిగానీ శంబుకునికి జరిగిన ఘోర అన్యాయంగానీ, ఆయన ప్రవచించిన సామాజిక న్యాయం కోసం శంబుకుడు సాగిస్తున్న పోరాటంగానీ మనకు తెలిసేది కాదు. తరాలు గడిచినా ‘శంబుక వధ’లు నేటికీ స్వతంత్ర భారతంలో విచ్చలవిడిగా కొనసాగడానికి మూల కారణం– భూస్వామ్య, పెట్టుబడి దారీ వ్యవస్థలో సామాజిక న్యాయాన్ని అక్షరాలా పాటించడానికి మౌలి కంగానే వ్యతిరేకమన్న సత్యాన్ని నిద్రలో కూడా విస్మరించరాని సత్యం. అందుకే భవభూతి రచనలో అగ్రవర్ణ వశిష్టుడు రాచరిక సలహాదారుగా మధ్యలో వచ్చి, తనపై విధిగా ఆధారపడవలసి వచ్చిన చక్రవర్తి రాము డిని శాసించి మరీ శంబుకుని చంపేయమని సలహా ఇచ్చాడు. తమ ‘మత విశ్వాసాల’ వ్యాప్తికి అలా శంబుకుని కడతేర్చారు. పురోహిత వర్గంమీద ఆధారపడి రాజ్యపాలన నడిపితే ఇలాంటి అనర్థాలే కలుగు తాయని వశిష్టుడిని నమ్ముకున్న రాముడికి ‘యాది’ లేకపోబట్టే, తన భార్య సీతమ్మ మీద దారిన పోయే దానయ్య వేసిన దారుణమైన అప వాదును నమ్మి అగ్నిపరీక్షకు గురిచేశాడు. 
ఆ రీతిగానే ఆనాడు పరాయివారైన ఆర్యుల నుంచి దాడులకు గురైన స్వతంత్ర ద్రావిడ జాతుల రక్షణకు, సామాజిక న్యాయం కోసం పోరు బాట పట్టినవాడు శంబుకుడు. అందువల్ల తపోభంగం వల్లనే శంబుకుడు ద్రావిడునిగా పుట్టి ఉంటాడన్న కట్టుకథలు అల్లినవాళ్లు వశిష్ట, సోమయాజాదులు. ఇలాంటి కథలతోనే ఈ రోజుకీ మన దేశంలో పాలకవర్గాలు తమ విధానాలను నిశితంగా విమర్శించే ప్రజల్ని చైతన్యపరిచే సామాజిక శాస్త్రవేత్తలను, రాజకీయ శాస్త్ర, వైజ్ఞానిక శాస్త్ర ఉద్దండులైన ప్రొఫెసర్‌ కల్బుర్గి, పన్సారి, లంకేష్, డాక్టర్‌ సాయిబాబ లాంటి పోరాటయోధుల్ని వేధించడమో నర్మగర్భంగా పరిమార్చడమో, సాక్ష్యాలు లేకుండా హంతకుల్ని కాపాడటమో యథే చ్ఛగా జరుగుతూనే ఉంది. అంతేగాదు, కురుక్షేత్ర సంగ్రామానికి, పల్నాటి యుద్ధానికి కారణం ఆస్తిపాస్తుల పంపిణీ కోసం దాయాదుల తగవులాటలే అయినా రెంటికీ మధ్య ఒక్క స్పష్టమైన తేడా ఉంది. అది– పల్నాటి యుద్ధ ఫలితం కుల, మతాల వివక్షకు అతీతంగా చరిత్రలో మొదటిసారిగా సామాజిక న్యాయానికి తెర ఎత్తిన తొలి ‘చాపకూడు’ సిద్ధాంత ప్రతిష్టాపన. 

అందుకే కారెంపూడి క్షేత్రంగా సాగిన పల్నాటి యుద్ధం సామాజిక న్యాయ ప్రతిష్టాపనకు జరిగిన తొలి ప్రయత్నం అయినందుననే శ్రీనాథుడు నాగులేటి ఒడ్డున ఉన్న ‘గంగాధరమడుగు’ను పుణ్యక్షే త్రంగా భావించి కాశీలోని మణికర్ణిక ఘట్టంతో పోల్చాడు, ఆ మడుగు సమీపంలోనే పల్నాటి ‘వీరుల అడుగుజాడలు’ ఉండటమూ ఓ విశేషం. ఈ వీరుల స్మత్యర్థంగానే మతాతీతంగా. ఓ మహ్మదీయ సేనా పతి గుడి కట్టించాడు. శ్రీనాథుడు ఆనాడు మేడపి, కారెంపూడి యుద్ధాలు తెలుసుకున్నాడు. తర్వాత నిన్నగాక మొన్న ఆ పల్నాటిలోని ఆత్మకూరులో కూడా స్థానికులు కోడిపుంజుల్లా రెచ్చిపోవటం చూశాం –అదీ సామాజిక న్యాయం కోసం సాగుతున్న అణగారిన వర్గాల నిరంతర పోరాటమే. కనుకనే శంబుకుని లాంటి గడసరి దళిత విజ్ఞాని కుత్తుకను కాస్తా కోసి పారేస్తేగానీ పీడ వదలదనుకున్నాడు అగ్రవర్ణ వశిష్టుడు. సామాజిక న్యాయాన్ని పాటించడానికి, ప్రజలందరినీ సమాన దృష్టితో పాలించడానికి సమాన హక్కులు అవసరమని, అని వార్యమని, ఇది మత ప్రసక్తి లేని పౌర హక్కులకు గర్వకారణమన్నది శంబుకుని ధర్మదీక్ష. ఆ మార్గంలోనే ముందుకు సాగి కన్నడ సమా జాన్ని ప్రభావితం చేసినవాడు బసవన్న. అతని కులాతీత, వర్గాతీత వచనాలు. అందుకే 13వ శతాబ్ది నాటి నలందా బౌద్ధ విశ్వవిద్యాలయ ప్రసిద్ధ ఆచార్యుడు ధర్మకీర్తి తన ‘ప్రమాణవార్తికం’లో– వైజ్ఞానిక దృష్టికీ, భౌతికవాదానికీ దూరమైన కొద్దీ మూఢవిశ్వాసాలు ఎలా పెరుగుతూ వస్తాయో ఒక శ్లోకంలో వర్ణించాడు. దాని అర్థం– ‘వేదాన్ని ప్రమాణం అనుకోవడం, కర్త ఈశ్వరుడొకడున్నాడని భావించడం, గంగలో మునిగితే పుణ్యం వస్తుందనుకోవడం, జాతి, కుల మతాల్ని చూసుకుని గర్వపడిపోవడం, పరులపట్ల అన్యాయం, పాపం చేసి, దాన్ని మాఫీ చేయడానికి ఉపవాసాల ద్వారా శరీరాన్ని బాధపెట్టు కోవడం–ఈ అయిదున్నూ మూర్ఖులు చేసే పనులు’ అన్నాడు. అందుకే శంబుకుని వధలు, వ్యథలు త్రిపురనేని రామస్వామి రచించిన నూరేళ్ల తర్వాత కూడా కొనసాగుతూనే ఉన్నాయి. అందుకే కవి రాజు కలం చిరంజీవం. జాతీయోద్యమ కాలంలో తెలుగువారిలో ఆనాడు స్ఫూర్తిని ప్రదీప్తం చేయడం కోసం చేతిలో వీరగంథం అందుకొని కన పడిన వీరులకల్లా పూసిపోదామని త్రిపురనేని ఎదురుతెన్నులు కాచాడు. ఇప్పుడా వీరగంథం సామాజిక న్యాయం కోసం తపించే ఏ పాలకుడి కోసం, ఏ వీరుడి కోసం వేచి ఉంటుందో చూడాలి.

https://www.sakshi.com/sites/default/files/article_images/2020/05/26/ABK-NEW-IMAGEF.jpg

ఏబీకే ప్రసాద్‌, సీనియర్‌ సంపాదకులు 
abkprasad2006@yahoo.co.in