http://www.teluguglobal.in/wp-content/uploads/2020/05/yv-subba-reddy-press-meet.jpg

ఆస్తుల వేలంపై నిర్ణయం తీసుకోలేదు…

పెద్దగా ఉపయోగం లేని టీటీడీ ఆస్తులను వేలం వేయాలన్న అంశంపై పెద్దెత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సోమవారం మీడియా ముందుకొచ్చారు. ఈ అంశంపై వివరణ ఇచ్చారు.

తమపై వ్యక్తిగతంగా నిందలు వేస్తే తట్టుకునే శక్తి తమకు ఉందని… నిందలు తమకు కొత్తేమీ కాదన్నారు. కానీ తిరుమల కొండ విషయంలో అసత్యవార్తలు ప్రచురించవద్దని వైవీ సుబ్బారెడ్డి కోరారు. ఈనాడు రామోజీరావు దేవుడిని కొలుస్తారో లేదో తనకు తెలియదు గానీ… ఈనాడు పత్రికలో రెండు రోజులుగా ప్రచురించిన అంశాలు మాత్రం చాలా బాధ కలిగించాయన్నారు.

తిరుమల కొండపై వార్తలు రాసే సమయంలో రాజకీయాలు మానుకోవాలని విజ్ఞప్తి చేశారు. వేలం వేస్తున్న ఆస్తుల విలువ కోటి 53లక్షలు అని రాశారని… తమకు దోచుకునే ఆలోచనే ఉంటే ఇలా ఇంత చిన్న విలువైన భూములను వేలం వేస్తామా అని ప్రశ్నించారు. తమకు చేతనైతే దేవుడికే కానుకలు సమర్పించే ప్రయత్నం చేస్తాము గానీ… ఏరోజు కూడా స్వామి సొమ్మును ఆశించే వారిమి కాదన్నారు.

తాను చైర్మన్‌గా నియమితులైన సమయంలో ఇదే తరహాలో తనపై అసత్యప్రచారం చేశారని గుర్తు చేశారు. చంద్రబాబు హయాంలో సదావర్తి భూములను, విజయవాడ దుర్గమ్మ భూములను, సింహాచలం ఆలయ భూములను ఎలా కొట్టేశారో అందరికీ తెలుసన్నారు. తమకు అలాంటి దురాలోచనలు లేవన్నారు. తాము దేవుడి ఆస్తులకు రక్షకులుగా ఉంటామే గానీ… వాటిని దుర్వినియోగం చేసే వ్యక్తులం కాదని వివరించారు.

టీటీడీ నిధులను ఇతర పనులకు మళ్లించింది చంద్రబాబు ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. టీటీడీ నిధులను ఫైఓవర్‌ నిర్మాణానికి 460కోట్లు చంద్రబాబు ప్రభుత్వం మళ్లించిందన్నారు. చెరువు సుందరీకరణకు చంద్రబాబు హయాంలో 120కోట్లు మళ్లించారన్నారు. తాము వచ్చిన తర్వాత వాటిని పునర్‌సమీక్షించామని సుబ్బారెడ్డి చెప్పారు. మున్సిపాలిటీ చేయాల్సిన పనులకు టీటీడీ నిధులను వందల కోట్లు మళ్లించిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు.

ఉపయోగం లేని భూములను విక్రయించే పని తామే మొదలుపెట్టినట్టు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. టీడీపీ నేత చదలవాడ కృష్ణమూర్తి టీటీడీ చైర్మన్‌గా ఉన్నప్పుడు ఈ 50 ఆస్తుల అమ్మకానికి ఆమోదం తెలిపారని వైవీ సుబ్బారెడ్డి వివరించారు.

చిన్నచిన్న ఆస్తులను టీటీడీ నిర్వహించడం ఇబ్బంది అవుతుందని… కాబట్టి వాటిని విక్రయించి డబ్బును టీటీడీ కార్పస్ ఫండ్‌కు జమ చేయాలని టీడీపీ హయాంలో టీటీడీ పాలక మండలి నియమించిన కమిటీనే సిఫార్సు చేసిందన్నారు. ఈ సిపార్సు ఆధారంగా 50 ఆస్తుల విక్రయానికి చదలవాడ కృష్ణమూర్తి నేతృత్వంలోని పాలకమండలి 2016 జనవరి 30న ఆమోదం తెలిపిందన్నారు.

నాడు ఆస్తులు అమ్మాలని సిపార్సు చేసిన కమిటీలో సభ్యులుగా ఉన్న బీజేపీ నేత భానుప్రకాశ్‌ రెడ్డిలాంటి వారే ఇప్పుడు విమర్శలు చేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు.

నాడు మౌనంగా ఉన్న పత్రికలు ఇప్పుడు ఏమీ జరగకపోయినా తప్పు చేసినట్టు ప్రచారం చేస్తున్నాయని వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. వేలం వేయాలన్న దానిపై ఇంకా పూర్తి స్థాయిలో నిర్ణయం కూడా తమ పాలకమండలి తీసుకోలేదన్నారు. ఈ ఆస్తుల నిర్వాహణపై పరిశీలన చేయాల్సిందిగా అధికారులకు సూచనలు మాత్రమే చేశామన్నారు. వేలంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని… కేవలం రోడ్‌మ్యాప్‌ పై అధికారులకు సూచనలు చేశామన్నారు.

వేలం వేయాలనుకున్న ఆస్తులన్నీ సెంటు, రెండు సెంట్లు, గరిష్టంగా 5 సెంట్ల వరకు ఉన్నాయన్నారు. వేలం వేయాలనుకున్న వ్యవసాయ భూముల విస్తీర్ణం గరిష్టంగా ఎకరం నుంచి ఎకరన్నర వరకు ఉన్నాయన్నారు. ఎక్కడో మారుమూల గ్రామాల్లో ఉన్న సెంటు, రెండు సెంట్ల స్థలంలో అక్కడికి వెళ్లి టీటీడీ చేయడానికి కార్యక్రమాలు కూడా ఏమీ ఉండవన్నారు.

ఆస్తుల వేలంపై ఇంత దుమారం చేయాల్సిన అవసరం లేదన్నారు. తాము ఇంకా వేలంపై నిర్ణయం తీసుకోలేదని… ఎలాంటి నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదన్నారు. వచ్చే పాలకమండలి సమావేశంలో ఈ అంశంపై మరోసారి చర్చిస్తామన్నారు. ఈ ఆస్తులను రక్షించడం ఎలా అన్న దానిపై చర్చిస్తామని… ఒకవేళ ఆస్తులను పరిరక్షించే పరిస్థితి లేనప్పుడు ఆస్తులను అమ్మకుండానే భక్తుల మనోభావాలు కాపాడేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై చర్చిస్తామన్నారు. ఈ అంశంపై ధార్మిక పెద్దల నుంచి సలహాలు కూడా తీసుకుంటామన్నారు.

ఆస్తులు అన్యాక్రాంతం కాకూడదన్నదే తమ లక్ష్యమన్నారు. వేలం వేయాలన్న నిర్ణయం టీడీపీ హయాంలోని పాలకమండలే తీసుకుందని… తాము ఎక్కడా కూడా ఆస్తుల వేలంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. నిందలు వేయాలనుకుంటే తమపై వేయాలని… అంతే కాని ఆలయ ప్రతిష్ట దెబ్బతినేలా మాత్రం నిందలు వేయవద్దని ప్రతిపక్షాలను వైవీ సుబ్బారెడ్డి కోరారు.