లాక్‌డౌన్ లాకులు పీకిన చంద్రబాబు…
చంద్రబాబునాయుడు, టీడీపీ నేతలు లాక్‌డౌన్ నిబంధనలను యదేచ్చగా ఉల్లంఘించారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో కరకట్టపై ఉన్న నివాసానికి చంద్రబాబు వెళ్లారు. చంద్రబాబు ఇలా రోడ్డు మార్గంలో వెళ్తున్న సమయంలో పలు చోట్ల టీడీపీ కార్యకర్తలు వందలాది మంది పోగయ్యారు.
స్థానిక టీడీపీ నేతలు భారీగా కార్యకర్తలను రోడ్డు మీదకు తీసుకొచ్చి చంద్రబాబుకు స్వాగతం పలికారు. నల్లగొండ జిల్లాలోనూ ఇదే ఉదంతం జరిగింది. కృష్ణా జిల్లాల్లో కార్యకర్తలు మరింత రెచ్చిపోయారు. చంద్రబాబు కాన్వాయ్ వెంట బైక్ ర్యాలీలు నిర్వహించారు.
జెండాలు పట్టుకుని రోడ్లపై నివాదాలు చేశారు. కార్యకర్తలే అనుకుంటే చంద్రబాబు కూడా నిబంధనలను ఉల్లంఘించారు. కారు నుంచి దిగి రోడ్లపైనే కార్యకర్తలతో చిట్‌చాట్ పెట్టారు. విక్టరీ సింబల్ చూపుతూ కార్యకర్తలను ఉత్సాహపరిచారు.
వైసీపీ ఎమ్మెల్యేలు లాక్‌డౌన్ సమయంలో ఇబ్బందిపడుతున్న పేదలకు నిత్యావసరాలు అందజేస్తే రచ్చ చేసిన చంద్రబాబు…. తన పార్టీ నేతల ద్వారా హైకోర్టులో పిటిషన్లు వేసి వైసీపీ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇప్పించిన చంద్రబాబు… ఇప్పుడు తాను చేసింది ఏమిటని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు వ్యవహారాన్ని హైకోర్టు సుమోటోగా స్వీకరించి చర్యలు తీసుకోవాలని వైసీపీ వారు డిమాండ్ చేశారు.
అయితే కొద్దిరోజుల క్రితం లాక్‌డౌన్ వల్ల ప్రజలు ఇబ్బంది పడుతుంటే వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు మదుసూదన్ రెడ్డి, విడదల రజినీ, రోజా, ప్రసన్న కుమార్ రెడ్డి… లాంటి వాళ్ళు ప్రజలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఆ సమయంలో వైసీపీ ఎమ్మెల్యేలు లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంగించారంటూ టీడీపీ సానుభూతీ పరులు హైకోర్టులో పిటిషన్ లు వేశారు.
వెంటనే హైకోర్టు వైసీపీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీచేసింది. ఈ లాక్‌డౌన్ ఉల్లంఘణపై సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించకూడదంటూ ఆసాధారణ రీతిలో ప్రశ్నించింది.
ఈ నేపధ్యంలోనే ఇప్పుడు చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నుంచి ఉండవల్లిలోని తన నివాసానికి వెళ్తూ దారిపొడువునా ప్రతి జిల్లాలో వందలాదిమంది కార్యకర్తలతో స్వాగతం అందుకున్నారు. కార్యకర్తల ఉత్సాహమే అనుకుంటే చంద్రబాబు నాయుడు ఏకంగా కారునుంచి బయటకు వచ్చి విక్టరీ సింబల్ చూపుతూ నడిరోడ్డుపైనే కార్యక్తలకు కరచాలనం చేస్తూ కుశల ప్రశ్నలు వేస్తూ ఒక తరహా విజయోత్సవ ర్యాలీలను నిర్వహించినట్లుగా అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు.
ఈ తీరుని సోషల్ మీడియాలో నెటిజన్ లు పెద్ద ఎత్తున ప్రశ్నిస్తున్నారు. పేదలకు సాయం చేస్తున్నందుకే లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంగించారని వైసీపీ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు చంద్రబాబుకు కూడా నోటీసులు జారీ చేయాలని హైకోర్టుకు నెటిజన్ లు విజ్ఞప్తిచేస్తున్నారు.
ఎమ్మెల్యే రోజా ఒక గ్రామానికి తాగునీటి అవసరాలను తీర్చేందుకు వెళ్తే పెద్ద రచ్చ చేసిన మీడియా ఛానళ్ళు చంద్రబాబు విషయంలో మాత్రం భిన్నంగా వ్యవహరించాయి. లాక్‌డౌన్ నిబంధలను ఉల్లంఘించడంపై ప్రశ్నించకపోగా చంద్రబాబుకు ‘ఘనస్వాగతం… కార్యకర్తల నీరాజనం…’ అంటూ కీర్తించడం విశేషం.