శుభ్రంగా పని చేసుకుందాం
సినిమా షూటింగ్ అంటే సందడి. ఓ హడావిడి. ఓ గందరగోళం. లొకేషన్ అంతా యూనిట్ సభ్యులతో కిటకిటలాడుతుంది. రానున్న రోజుల్లో సందడి ఉంటుంది కానీ లొకేషన్లో ఉండేవాళ్ల సంఖ్య తగ్గుతుంది. హడావిడి ఉంటుంది.. భద్రతతో కూడినది. కరోనా పూర్తిగా తొలగిపోలేదు. పనులన్నీ మెల్లిగా ప్రారంభమయ్యాయి. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మళ్లీ షూటింగ్‌కి అనుమతులు ఇవ్వడానికి రెడీ అవుతున్నాయి.
షూటింగ్ చేసే పరిసరాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి నిబంధనలు పాటించాలి? వంటి విషయాలతో ప్రతీ ఇండస్ట్రీ కొన్ని గైడ్‌లెన్స్ తయారు చేసుకుంటోంది. తాజాగా బాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన టీవీ మరియు సినిమాల చిత్రీకరణలో ‘ఇలాంటి భద్రతలను పాటిస్తూ షూటింగ్ చేసుకుంటాం’ అని ప్రొడ్యూసర్స్ గిల్డ్ కొన్ని గైడ్ లైన్స్‌తో ఓ లేఖను మహారాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. అందులోని గైడ్ లైన్స్‌ని నిర్మాణ సంస్థలు పాటించాలని.. ఇవన్నీ పాటిస్తూ ‘శుభ్రంగా’ పని చేసుకుందాం అని గిల్డ్ కోరనుంది. కొన్ని గైడ్ లైన్స్ ఈ విధంగా.
► లొకేషన్‌కి అడుగుపెట్టే ముందు ప్రతిఒక్కరూ చేతులు శుభ్రంగా కడుక్కోవడం, వారితో పాటు తెచ్చుకున్నవన్నీ శానిటైజ్ చేయడం తప్పనిసరి.
► లొకేషన్‌లో ఉండేవాళ్లందరూ తప్పకుండా మాస్కులు ధరించే పని చేయాలి. వాడిన మాస్క్‌ను జాగ్రత్తగా పడేయాలి. ఎక్కడపడితే అక్కడ వదిలేయకూడదు.
► సెట్లో చేతులు కలపడాలు, కౌగిలించుకోవడాలు మానేయాలి.
► చిత్రీకరణలో వాడే తినుబండరాలను సురక్షితంగా ఉండేలా చూసుకోవాలి.
► లొకేషన్‌లో ప్రతిఒక్కరూ కనీసం రెండు మీటర్ల దూరం పాటించాలి.
► ఈ జాగ్రతలన్నీ అలవాటుగా మరేంత వరకూ ప్రతిరోజూ ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో షూటింగ్‌కి ముందు ఓ డ్రిల్‌లా చేయాలి.
► షూటింగ్‌కి 45 నిమిషాల ముందే ప్రతీ ఒక్కరూ లొకేషన్‌లో ఉండేలా చూసుకోవాలి.
► ప్రతీరోజూ షూటింగ్‌కి ముందు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిన ఏజెన్సీ ద్వారా స్టూడియో మొత్తాన్ని శానిటైజ్ చేయించాలి.
► లొకేషన్లో చేతులు శుభ్రపరుచుకోవడానికి వీలుగా బేసిన్‌లు ఏర్పాటు చేయాలి.
► ఇంట్లో ఉండి అయినా చేయగలిగే పని అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ పద్ధతిని ప్రోత్సహించాలి. 60 ఏళ్లకు పైబడిన వాళ్లు, ఆరోగ్యం బాగాలేని వాళ్లను ఇంటి నుండి పని చేసేలా చూడాలి.
► సినిమాకు పని చేసే ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యంగా ఉన్నట్టు డాక్టర్ సర్టిఫికెట్‌ను నిర్మాణ సంస్థకు అందజేయాలి.
► ఫేస్ మాస్కులను, గ్లౌజ్‌లను తప్పనిసరిగా వాడేలా చూసుకోవాలి.
► నటీనటుల ఆడిషన్స్ అన్నీ కూడా ఆన్‌లైన్‌లో చేసుకునేలా చూసుకోవాలి.
► చిత్రీకరణ జరిపే లొకేషన్ ఏ జోన్‌లోఉందో చూసుకుని దాన్ని బట్టి అనుమతులు తీసుకుని చిత్రీకరణ జరపాలి.
► లొకేషన్స్ కోసం వెతకడానికి వెళ్లినప్పుడు టీమ్‌లో తక్కువ మంది ఉండేట్టు చూసుకోవాలి.
► మేకప్, హెయిర్ స్టయిల్ ఆర్టిస్ట్‌లు తప్పనిసరిగా ఫేస్ మాస్క్ ధరించే మేకప్, స్టయిలింగ్ చేయాలి. కచ్చితంగా చేతులు శుభ్రం చేసుకుని మేకప్ వేయాలి.
► యాక్టర్ మేకప్ వేసుకున్న తర్వాత మాస్క్ ధరించడం కుదరకపోతే ఫేస్ మాస్క్ వేసుకోవాలి.
► విగ్గులు, సవరాలు తప్పకుండా శానిటైజ్ చేసినవే వాడాలి.
► సినిమాకు వాడే కాస్ట్యూమ్స్ తప్పకుండా శుభ్రపరిచినవే వాడాలి.
► క్యాటరింగ్ చేసేవాళ్లు తప్పనిసరి పీపీఈ కిట్స్ ధరించాలి. అవసరమైతే ఇంట్లో తయారు చేసుకున్న భోజనం తీసుకురావడం బెస్ట్.
► వీలైనంత అవుట్ డోర్ షూటింగ్స్ తగ్గించుకోవాలి. వీలైనంత తక్కువమంది స్టాఫ్ పని చేసేట్టు చూసుకోవాలి.