https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/05/25/Migrants.jpg?itok=EzBQTlB3
ప్రతీకాత్మక చిత్రం

వలసల్లో రాజస్థాన్‌కు ప్రత్యేక స్థానం

జైపూర్‌: కరవు కాటకాలు సంభవించినప్పుడు ప్రజా వలసలను నియంత్రించడంలో రాజస్థాన్‌ రాష్ట్రానికి భారత్‌లోనే ఓ ప్రత్యేక స్థానం ఉంది. రాజస్థాన్‌ వందేళ్ల వలసల చరిత్రను తీసుకున్నట్లయితే మూడేళ్లపాటు అతి భయంకర కరవు పరిస్థితులను, ఏడేళ్లపాటు తీవ్ర కరవు పరిస్థితులు, 63 ఏళ్లు సాధారణ కరవు పరిస్థితులను ఎదుర్కోగా, 27 ఏళ్లు మాత్రమే ఎలాంటి కరవు కాటకాలులేని మంచి పరిస్థితులతో కళకళలాడింది.

ఎక్కువ ఏళ్లు కరవు పరిస్థితులు ఎదురవుతున్న కారణంగానో, మరెందుకోగానీ కరవు పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు ఇతర ప్రాంతాలకు వలసలు పోకుండా రాయితీలిచ్చేది. పేద ప్రజల నుంచి పాలకులు పన్నులు వసూళ్లను వాయిదా వేసేవారు. వారికి మంచినీటి బావులను, కుంటలను తవ్వించేవారు. వ్యవసాయానికి రుణాలిచ్చేవారు. ఇచ్చిన అప్పుల వసూళ్లకు ఒత్తిడి చేయవద్దంటూ వడ్డీ వ్యాపారులను హెచ్చరించేవారు. 18వ శతాబ్దంలో రాజ్‌పుత్‌లు పాలకులుగా ఉన్నప్పుడు ఇలా రాయితీలు ఇచ్చేవారని చరిత్ర పుటలు తెలియజేస్తున్నాయి. (లాక్‌డౌన్‌తో సాధించిన ఫలితాలేమిటి?)

1783 నుంచి 1786 వరకు రాజస్థాన్‌లో కరవు పరిస్థితులు ఏర్పడినప్పుడు వ్యవసాయ పన్నులను జోధ్‌పూర్‌ పాలకులు మూడేళ్లపాటు రద్దు చేశారు. 1987లో వచ్చే పంటలో శిస్తు వసూల్‌ చేయాలని నిర్ణయించారట. బికనూర్‌లో 1783 నుంచి 86 మధ్య ‘జమా’ పేరుతో వసూలు చేసే పన్నును పూర్తిగా రద్దు చేశారు. అలాగే సితాసర్‌లో ఇంటి పన్నును రద్దు చేశారు. కిందసార్‌లో జమా పన్నును 80 రూపాయల నుంచి 22 రూపాయలకు తగ్గించారు. నాడు ఒక ప్రాంతం నుంచి వలసలు పోకుండా ప్రజలకు రాయితీలు కల్పించగా, నేడు వెనక్కి తిరిగి వెళిపోతున్న వలస కార్మికులను నిలువరించేందుకు ఆయా కంపెనీలు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. వెళ్లిపోతున్న వారికి కనీసం బస్సు చార్జీలను కూడా కల్పించడం లేదు. (కార్మికులు లేక ‘పరిశ్రమల లాక్‌డౌన్‌’)