https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/05/25/Migrants1.jpg?itok=YK4l5ctG
ప్రతీకాత్మక చిత్రం

భారత్‌ ఆది నుంచి వలసల దేశమే!

సాక్షి, న్యూఢిల్లీ : ‘భారత ఆర్థిక, సామాజిక పరిణామక్రమం వలసలపైనే ఆధారపడి ఉంది’ క్లాడ్‌ మార్కోవిట్స్, జాక్వెచ్, సంజయ్‌ సుబ్రమణియం సంయుక్తంగా ఎడిట్‌ చేసిన ‘సొసైటీ అండ్‌ సర్కులేషన్‌ మొబైల్‌ పీపీల్‌ అండ్‌ ఇటినరెంట్‌ కల్చర్స్‌ ఇన్‌ సౌత్‌ ఆసియా 1750–1950’లో పేర్కొన్నారు. భారత్‌లో ఒకప్పుడు ఎక్కువగా రైతులు, పశువులు, గొర్రెల కాపరులు వలసలుపోగా, ఆ తర్వాత చేనేత, విశ్వకర్మలు, వడ్రంగి తదితర వృత్తి కళాకారులు వలసలు పోయారు. పట్టణాల పారిశ్రామీకరణ కారణంగా ప్రధానంగా కార్మికులు వలసలుపోగా, నేడు అన్ని రంగాలకు చెందిన కూలీలు, కార్మికుల నుంచి ఐటీ నిపుణుల వరకు అందరు వలసలు పోతున్నారు.

ఈ వలసలు భారత్‌లో స్వాతంత్య్రానికి ముందు తర్వాత కూడా కొనసాగాయి. కరవు, కాటకాలు, తుపానులు సంభవించినప్పుడే కాకుండా ప్లేగ్‌ లాంటి అంటురోగాలు వ్యాపించినప్పుడు మతోన్మాద అల్లర్లు చెలరేగినప్పుడు కూడా వలసలు జరిగాయి. ఒకప్పుడు పలు వలసలు ప్రాణాంతకంగా మారిన విషాద ఉదంతాలే కాగా, నేడు ‘ఘర్‌వాపసీ’ పేరిట కార్మికులు వెనక్కి తిరిగిపోతున్న వలసలే విషాదాంతాలు అవుతున్నాయి. (లాక్‌డౌన్‌తో సాధించిన ఫలితాలేమిటి?)

1782 నుంచి 1787 మధ్య కరవు కాటకాటకాలు తాండవించడంతో రాజస్థాన్‌ నుంచి ఇతర ప్రాంతాలకు వలసలు కొనసాగాయి. ఆ తర్వాత సింధ్‌, మాల్వా, గుజరాత్, పంజాబ్‌ రాష్ట్రాలకు రైతులు, పశువుల కాపర్ల వలసలు ఎక్కువగా జరిగాయి. 1891–92 సంవత్సరంలో కరవు పరిస్థితులు ఏర్పడినప్పుడు 46 శాతం రైతులు, పశువులు ఆ ప్రాంతాలకు వలసలు పోయారు. 1899–1900 సంవత్సరంలో కరవు పరిస్థితుల ఏర్పడినప్పుడు మాల్వా, గుజరాత్, సింధ్‌, దక్షిణ పంజాబ్‌తోపాటు సెంట్రల్‌ ప్రావిన్స్‌కు 12 శాతం ప్రజలు, 20 శాతం పశువులు వలసలు పోయాయి. వలసపోయిన ప్రజలు వెనక్కి వచ్చినప్పుడు వారి ఇళ్లు, భూములు అన్యాక్రాంతం అయ్యేవి. వాటికోసం పోరాడితే కొందరికి న్యాయం జరిగేది. కొందరికి జరిగేది కాదు. భారత్, పాకిస్థాన్‌ రెండు దేశాలుగా విడిపోయినప్పుడు, ఆ తర్వాత జరిగిన మతోన్మాద అల్లర్ల సందర్భంగా కూడా వలసలు కొనసాగాయి.