ఆకస్మిక వరదలు.. కలకలం
గువాహటి: ఒక్కపక్క కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్న అసోం రాష్ట్రాన్ని ఇప్పుడు వరదలు వణికిస్తున్నాయి. శనివారం నుంచి కురుస్తున్న భారీ వర్షం కారణంగా రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో ఆకస్మిక వరదలు సంభవించాయి. దీంతో 10,000 మందికి పైగా ప్రజలు కష్టాలు ఎదుర్కొంటున్నారని ప్రభుత్వం తెలిపింది. పొరుగున ఉన్న మేఘాలయలోని గారో హిల్స్ ప్రాంతం నుంచి ఆకస్మిక వరదలు సంభవించాయని వెల్లడించింది. అసోంలోని లఖింపూర్, సోనిత్పూర్, దరాంగ్, గోల్పారా జిల్లాల్లోని 46 గ్రామాలకు చెందిన 10,801 మంది ప్రజలు వరదలు కారణంగా ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు.
కాగా, వరద ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ ఆదేశించారు. వరద సమయంలో సత్వర ఉపశమనం, సహాయక చర్యలు చేపట్టడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని డిప్యూటీ కమిషనర్లను ఆదేశించినట్టు చెప్పారు. వరదలను ఎదుర్కోవటానికి ఇప్పటికే అన్ని సన్నాహాలతో జిల్లా యంత్రాంగాలు సన్నద్ధమయ్యాయని, బాధిత ప్రజలకు సాధ్యమైనంత సహకారాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. వరదలు నేపథ్యంలో కరోనా వైరస్ నుంచి ముప్పు మరింత ఎక్కువగా ఉంటుందని, ప్రజలంతా కలిసికట్టుగా ఈ విపత్తును ఎదుర్కొవాలని ఆయన పిలుపునిచ్చారు. హోమ్ క్వారంటైన్ ఉన్నవారు ఆరోగ్య శాఖ ఆదేశాలను కచ్చితంగా పాటించాలని, ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అసోంలో వర్షాల కారణంగా బ్రహ్మపుత్ర నది నీటి మట్టం గంట గంటకు పెరుగుతోందని సెంట్రల్ వాటర్ కమిషన్ సభ్యుడు శరత్‌చంద్రా కలిత తెలిపారు. ‘ఈరోజు ప్రతి గంటకు 2 సెంటీమీటర్ల చొప్పున నీటిమట్టం పెరుగుతోంది. వర్షాల కారణంగా మే 16 నుంచి నదిలో నీటిమట్టం పెరుగుతూనే ఉంద’ని ఆయన చెప్పారు.
కాగా, అసోంలో తాజాగా 48 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కోవిడ్-19 కేసుల సంఖ్య 514కు చేరుకుంది. కరోనా బారి నుంచి 62 మంది కోలుకోగా, 445 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా వైరస్ సోకి ఇప్పటివరకు అసోంలో నలుగురు ప్రాణాలు కోల్పోయినట్టు రాష్ట్ర మంత్రి హిమంతబిశ్వా శర్మ సోమవారం తెలిపారు. (ఒక్క రోజులో 6,977 కరోనా కేసులు)