యుద్ధానికి మా ఆర్మీ సిద్ధం: నేపాల్ మంత్రి
- భారత ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలపై నేపాల్ రక్షణ మంత్రి స్పందన
ఖాట్మండూ: భారత ఆర్మీ చీఫ్ ఎంఎం నరవాణే నేపాలీ గూర్ఖాల మనోభావాలను గాయపరిచారని నేపాల్ రక్షణ శాఖా మంత్రి ఈశ్వర్ పోఖ్రేల్ విచారం వ్యక్తం చేశారు. భారత్ రక్షణ కోసం ఎన్నెన్నో త్యాగాలు చేసిన నేపాలీ సైన్యాన్ని తక్కువ చేసి మాట్లాడారని.. ఆయన వ్యాఖ్యల వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయని విమర్శించారు. లిపులేఖ్, కాలాపానీ, లింపియధుర ప్రాంతాల కోసం భారత్, నేపాల్‌ల మధ్య నెలకొన్న వివాదం నెలకొన్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో ఇటీవల ఓ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన భారత ఆర్మీ చీఫ్ ఎంఎం నరవాణే.. నేపాల్ వేరొకరి తరఫున వకాల్తా పుచ్చుకుని భారత్ పట్ల నిరసన వైఖరి ప్రదర్శిస్నుత్నట్లు కనిపిస్తుందన్నారు. భారత్‌తో చైనా ప్రచ్చన్న యుద్ధంలో భాగంగా డ్రాగన్‌కు నేపాల్ అనుకూలంగా వ్యవహరిస్తోందని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే నేపాల్ సైన్యం రంగంలోకి దిగాలే తప్ప వేరొకరిపై ఆధారపడకూడదని విమర్శించారు.(నేపాల్ దూకుడుకు భారత్ గట్టి కౌంటర్)
ఈ విషయంపై స్పందించిన ఈశ్వర్ పోఖ్రేల్ సోమవారం మాట్లాడుతూ.. ‘‘భారత్‌ను రక్షించేందుకు తమ జీవితాలను అర్పించిన నేపాలీ గూర్ఖా సైన్యం మనోభావాలను భారత ఆర్మీ చీఫ్ కించపరిచారు. గూర్ఖా బలగాలకు ఎదురుగా నిలబడటం ఇప్పుడు వారికి కష్టతరంగా మారినట్టుంది’’అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అదే విధంగా సమయం వచ్చినపుడు నేపాల్ సైన్యం ధీటుగా బదులిచ్చేందుకు సిద్ధంగా ఉంటుందన్నారు. ‘‘మా రాజ్యాంగాన్ని అనుసరించి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం యుద్ధం చేయాల్సి వస్తే నేపాల్ ఆర్మీ ఎల్లప్పుడూ సన్నద్ధంగా ఉంటుంది. కీలక సమయాల్లో తన వంతు పాత్ర తప్పక పోషించి తీరుతుంది. అయితే కాలాపానీ వివాదానికి పరిష్కారం కనుగొనేందుకు దౌత్యపరమైన చర్చలకే నేపాల్ మొగ్గుచూపుతుంది’’ అని ఈశ్వర్ పోఖ్రేల్ స్పష్టం చేశారు. (భారత్‌పై నేపాల్ అభ్యంతరం.. చైనా ప్రమేయం!)