కరోనా విజృంభణ: చైనా కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా విజృంభణ నేపథ్యంలో భారత్‌లో చిక్కుకున్న తమ దేశ పౌరులను స్వదేశానికి తీసుకువెళ్లేందుకు చైనా సిద్ధమైంది. ప్రత్యేక విమానాల ద్వారా చైనీయులను తరలించాల్సిందిగా ఢిల్లీలోని చైనా రాయబార కార్యాలయానికి సోమవారం నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో భారత్‌లో చిక్కుకున్న విద్యార్థులు, పర్యాటకులు, వ్యాపారవేత్తలు, యోగా కోసం భారత్‌కు వచ్చిన వారు, బుద్ధిస్టులు చైనాకు వెళ్లేందుకు అనుమతినిస్తున్నట్లు ఎంబసీ వెబ్‌సైట్‌లో పేర్కొంది. (అందుకే ఆ హెలికాప్టర్ డ్రోన్: చైనా)
ఈ నేపథ్యంలో స్వదేశానికి వెళ్లాలనుకుంటున్న చైనీయులు మే 27 ఉదయం నాటికి ఈ మేరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది. ప్రయాణానికి అయ్యే ఖర్చు పౌరులే భరించాలని.. చైనాలో దిగిన తర్వాత 14 రోజుల పాటు తప్పక క్వారంటైన్‌లో ఉండాలని షరతు విధించింది. అదే విధంగా కరోనా సోకిన వారు, వైరస్ లక్షణాలతో బాధపడుతున్న వారిని మాత్రం ప్రయాణానికి అనుమతించబోమని స్పష్టం చేసింది. ఒకవేళ ఎవరైనా ఉద్దేశపూర్వకంగా తమ మెడికల్ హిస్టరీని దాచి పెట్టి ప్రయాణానికి సిద్ధపడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అయితే ప్రత్యేక విమానాలు ప్రారంభమయ్యే తేదీని మాత్రం వెల్లడించలేదు. కాగా చైనా- భారత్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో డ్రాగన్ దేశం ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. (33 చైనీస్ కంపెనీలకు అమెరికా షాక్!)