
‘జపాన్ అని చెప్పి.. చైనాకు లాక్కెళ్తారా’
ముంబై: శ్రామిక్ రైళ్ల వ్యవహారమై శివసేన మరోసారి రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌పై విమర్శలకు దిగింది. మహారాష్ట్ర నుంచి ఉత్తరప్రదేశ్ వెళ్లాల్సిన శ్రామిక్ రైలు ఒడిశా మీదుగా ప్రయాణించడమేంటని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ట్విటర్ వేదికగా విమర్శలు గుప్పించారు. వలస కార్మికులను తరలిస్తున్న రైళ్లను ముందుగా నిర్ణయించిన మేరకు గమ్యస్థానాలకు చేర్చాలని స్పష్టం చేశారు. కాగా, ముంబైలో చిక్కుకుపోయిన వలస కార్మికులను ఉత్తరప్రదేశ్‌కు తరలించేందుకు రైల్వేశాఖ వసాయ్ రోడ్-గోరఖ్‌పూర్ శ్రామిక్ రైలును అందుబాటులోకి తెచ్చింది. ముంబైలోని పాల్గర్ నుంచి మే 21న అది బయల్దేరింది.
(చదవండి: ఉద్ధవ్‌పై మండిపడ్డ పియూష్ గోయల్)
అయితే, విపరీతమైన రద్దీ నేపథ్యంలో.. ఆ ట్రైన్‌ను ఒడిషా మీదుగా ఉత్తర్‌ప్రదేశ్‌కు తీసుకెళ్లారు. దాంతో 25 గంటల్లో గమ్యస్థానానికి చేరుకోవాల్సిన రైలు రెండున్నర రోజులకు గోరఖ్‌పూర్ చేరుకుంది. ఈనేపథ్యంలో వలస కార్మికులను నేరుగా స్వస్థలానికి చేర్చాల్సిందిపోయి.. వేరే మార్గంలో తీసుకెళ్లడంతో తిండిలేక తీవ్ర అవస్థలు పడ్డారని కాంగ్రెస్, శివసేన ఆగ్రహం వ్యక్తం చేశాయి. జపాన్ తీసుకెళ్తామని చెప్పి.. చైనాకు లాక్కెళ్తారా మహారాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి సచిన్ రావత్ ఎద్దేవా చేశారు. ఇదిలాఉండగా.. వలస కార్మికుల తరలింపునకు రైల్వేశాఖ కృషి అభినందనీయమని ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ పేర్కొనడం గమనార్హం.