https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/05/25/Jonty-Rhodes.jpg?itok=FQeFdfzU

జడేజాను అందుకోవడం కష్టం: రోడ్స్‌

కేప్‌టౌన్‌: జాంటీ రోడ్స్‌.. క్రికెట్‌ మైదానంలో ఫీల్డింగ్‌కే వన్నె తెచ్చిన ఆటగాడు. దక్షిణాఫ్రికా చెందిన ఈ క్రికెటర్‌ అసాధారణమైన ఫీల్డింగ్‌తో ప్రపంచ క్రికెట్‌లో తనదైన ముద్ర వేశాడు. రోడ్స్‌ అంటే ఫీల్డింగ్‌..ఫీల్డింగ్‌ అంటే రోడ్స్‌ అనేలా చరిత్రలో నిలిచిపోయాడు. డైవ్‌ కొట్టి క్యాచ్‌ పట్టడంలో రోడ్స్‌కు సాటి-పోటీ కూడా ఎవరూ లేరు. రెప్పపాటు వేగంలో క్యాచ్‌ను అందుకోవడం రోడ్స్‌ ప్రత్యేకత. మరి అటువంటి రోడ్స్‌కే ఒకరి ఫీల్డింగ్‌ అంటే చాలా ఇష్టమట. అది కూడా భారత్‌కు చెందిన క్రికెటరే. భారత క్రికెట్‌లో యువరాజ్‌ సింగ్‌, మహ్మద్‌ కైఫ్‌, సురేశ్‌ రైనా, రవీంద్ర జడేజాలు అద్భుతమైన ఫీల్డర్లు అనడంలో ఎటువంటి సందేహం లేదు. వీరిలో రవీంద్ర జడేజాకే ఓటేశాడు రోడ్స్‌. చాలామంది అద్భుతమైన ఫీల్డర్లు ఉన్నప్పటికీ జడేజా వంటి వేగం ఉన్న ఫీల్డర్లు మాత్రం చాలా అరుదుగా ఉంటారన్నాడు.(‘ఎంఎస్‌ ధోనిని ఫాలో అవుతా’)

సురేశ్‌ రైనాతో ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌ సెషన్‌లో మాట్లాడిన రోడ్స్‌.. ‘నీలో-నాలో లేనిది’ జడేజాలో ఉందన్నాడు.  అది జడేజాలో వేగమట. బంతిని అందుకునే క్రమంలో జడేజా పరుగెట్టే తీరు తనను ఇప్పటికీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుందన్నాడు. బంతి వెనకాల పరుగెడుతూ డైవ్‌ కొడతాడా.. లేక స్లైడ్‌(జారతాడా) అనేది ఇప్పటికీ కచ్చితంగా అంచనా వేయలేమన్నాడు. ఈ రెండింటికి కాస్త భిన్నంగా ఉండే జడేజా ఫీల్డింగ్‌ ఆకర్షణీయంగా ఉంటుందన్నాడు.

బౌండరీకి వెళుతుందనే బంతిని అమాంతం ఆపేసి అంతే వేగంగా పైకి లేవడం జడేజాకే సాధ్యమన్నాడు. అది జడేజాలో తాను చూసిన భిన్నమైన కోణమని రోడ్స్‌ తెలిపాడు. అది నీలోనూ, నాలోనూ కూడా లేదని కుండబద్ధలు కొట్టి మరీ చెప్పాడు రోడ్స్‌.  ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ మైకేల్‌ బెవాన్‌ తరహాలో జడేజా ఒక విభిన్నమైన ఫీల్డర్‌ అని కొనియాడాడు. ఎంత వేగంగా బంతిని ఆపుతాడో, అంతే వేగంగా పైకి లేచి పోవడం అనేది ఒక ప్రత్యేకమైన కళ అని పేర్కొన్నాడు. ఒకవేళ అదే బంతిని మనం పరుగెత్తి ఆపితే గ్రౌండ్‌లో మొత్తం దొర్లాల్సి వస్తుందన్నాడు.  ఒకవేళ మనం డైవ్‌ కొట్టి బంతిని ఆపి పైకి వెంటనే లేచినా మురికి మురికి చేసుకోవాల్సి వస్తుందన్నాడు. ఈ విషయంలో జడేజా కంప్లీట్‌ స్పీడ్‌ ఉన్న క్లీన్‌ మ్యాన్‌ అని చెప్పవచ్చన్నాడు. మరొకవైపు తమ దేశానికే చెందిన ఏబీ డివిలియర్స్‌ ఫీల్డింగ్‌ అంటే కూడా తనకు ఎంతో ఇష్టమన్నాడు. ఏబీ బ్యాటింగ్‌ను, ఫీల్డింగ్‌ను తాను ఎప్పుడూ మిస్‌ కానన్నాడు.(నన్ను వృద్ధుడిని చేసేశారు: భజ్జీ)