కోవిడ్-19 : ఎయిమ్స్ సీనియర్ ఉద్యోగి మృతి
- హైరిస్క్ ఉద్యోగులకు టెస్ట్‌లు అనివార్యం
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయిన ఎయిమ్స్ శానిటేషన్ సూపర్‌వైజర్ (58) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారని అధికారులు తెలిపారు. ఎయిమ్స్ ఓపీ విభాగంలో పనిచేసే సీనియర్ ఉద్యోగి వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని చెప్పారు. దేశ సేవలో మరో కరోనా యోధుడు ప్రాణాలు కోల్పోయారని ఎయిమ్స్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ శ్రీనివాస్ రాజ్‌కుమార్ ట్వీట్ చేశారు.
కరోనా మహమ్మారి అత్యంత ప్రమాదకర వైరస్ అని, విస్తృతంగా వ్యాపిస్తూ ఏ ఒక్కరిని విడిచిపెట్టదని ఆయన పేర్కొన్నారు. ఆస్పత్రిలో హైరిస్క్ విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ విధిగా కరోనా టెస్ట్‌లు నిర్వహించాలని ఎయిమ్స్ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి కుల్దీప్ ధిగాన్ డిమాండ్ చేశారు. శానిటేషన్ సూపర్‌వైజర్‌కు చివరి దశలో వైరస్‌ను గుర్తించే పరీక్ష చేయడంతో ఆయన ప్రాణాలకు ముప్పువాటిల్లిందని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా గత వారం ఎయిమ్స్ మెస్‌లో పనిచేసే ఓ కార్మికుడు కోవిడ్-19తో మరణించారు.