‘కరోనా ప్రభావం తగ్గడంతోనే బాబొచ్చారు’
సాక్షి, ఒంగోలు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేసిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. చంద్రబాబు పాలనలో దళితులకు అన్యాయం జరిగితే సీఎం వైఎస్ జగన్ పాలనలో దళితుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని చెప్పారు. ఏడాది కాలంలోనే అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని.. అది జీర్ణించు కోలేక ప్రతిపక్ష పార్టీలు అనవసర విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఆయన ఒంగోలులో సోమవారం మీడియాతో మాట్లాడారు.
కరోనా కష్ట సమయంలో వలంటీర్లు అందించిన సేవలు అభినందనీయమని విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి కొనియాడారు. కోర్టు తీర్పులు, మీడియాను అడ్డు పెట్టుకొని ప్రతిపక్ష టీడీపీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని దుయ్యబట్టారు. ప్రజలను మోసం చేయడానికే టీడీపీ అధినేత చంద్రబాబు విశాఖ టూర్ ఎంచుకున్నారని విమర్శించారు. కరోనా సోకుతుందనే భయంతో ఇన్ని రోజులు హైదరాబాద్‌లోనే ఉన్న చంద్రబాబు ఇప్పడు ప్రజల వద్దకు వస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కరోనా ప్రభావం తగ్గడంతో బాబు మళ్లీ ఏపీ బాట పట్టారని ఎద్దేవా చేశారు. ఆయనను రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితి లేదని మంత్రి పేర్కొన్నారు.