కార్మికులు లేక ‘పరిశ్రమల లాక్‌డౌన్’
సాక్షి, న్యూఢిల్లీ: ‘దేశంలో 400 కరోనా కేసులు నమోదయినప్పుడు లాక్‌డౌన్ ప్రకటించారు. ఇప్పుడు కేసులు లక్ష దాటేశాయి. ఇప్పుడు మమ్మల్ని పనిలోకి వెళ్లమంటున్నారు. ఇది మాకెంత వరకు సురక్షితం?’ అని అనిల్ కుమార్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ప్రశ్నించారు. ఆయన హరియాణాలోని పానిపట్ రైల్వే స్టేషన్ వద్ద మీడియాతో మాడ్లాడారు. స్థానిక టవళ్ల తయారీ కంపెనీలో తాను క్యాజువల్ లేబర్‌గా పనిచేస్తున్నానని, ఏప్రిల్, మే నెలలకు కంపెనీ జీతాలు ఇవ్వలేదని, అయినప్పటికీ లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితం అయ్యానని, కూడబెట్టుకున్న నాలుగు డబ్బులు కూడా ఖర్చవడంతో స్వరాష్ట్రమైన బిహార్‌కు బయల్దేరానని ఆయన చెప్పారు.
పానిపట్ దేశంలోనే జౌళి పరిశ్రమకు మంచి ప్రసిద్ధి. అక్కడి జౌళి పరిశ్రమలో యూపీ, బిహార్ నుంచి వచ్చిన దాదాపు నాలుగు లక్షల మంది వలస కార్మికులు పని చేస్తున్నారని, అందులో దాదాపు రెండు లక్షల మంది కార్మికులు స్వరాష్ట్రాలకు వెళ్లిపోయారని, అందుకని ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పటికీ స్థానికంగా పలు పరిశ్రమలు ఇంకా పని చేయడం లేదని ‘నార్తర్న్ ఇండియా రోలర్స్ అండ్ స్పిన్నర్స్ అసోసియేషన్’ అధ్యక్షుడు ప్రీతం సింగ్ సచిదేవ తెలిపారు. ఈ విషయాన్ని పానిపట్ డిప్యూటీ కమిషనర్ ధర్మేందర్ సింగ్ కూడా ధ్రువీకరించారు. ఈ సమయంలో వలస కార్మికులు ఊళ్లకు వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం ఎందుకు అనుమతి మంజూరు చేసిందో అర్థం కావడం లేదని సచిదేవ వ్యాఖ్యానించారు. ఊళ్లకు పోవాలా, వద్దా? అన్న ఆలోచనల్లో వలస కార్మికులు ఉన్నప్పుడు ఓ రాత్రి పదిన్నర గంటలకు పోలీసులు వచ్చి, తెల్లవారు జామున మూడు గంటలకు ప్రత్యేక బస్సు వెళుతోందని, వెళ్లాలనుకున్న వాళ్లు వెళ్లవచ్చని చెప్పారని, అలాంటప్పుడు ఎవరైనా ఎందుకు ఆగుతారని సచిదేవ ప్రశ్నించారు.
పరిశ్రమలు మూతపడినప్పుడు వలస కార్మికులను సొంతూళ్లకు వెళ్లేందుకు అనుమతించక పోవడం, తీరా ఫ్యాక్టరీలు తెరుచుకున్నాక ప్రభుత్వం అనుమతించడం పట్ల పరిశ్రమల యజమానులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీకి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న పానిపట ఒకప్పుడు హాండ్‌లూమ్ సిటీగా ప్రసిద్ధి. బెడ్‌షీట్స్, బ్లాంకెట్స్, కార్పెట్స్, టవల్స్, కర్టెన్లకు ప్రసిద్ధి. నగరంలో ఏటా పదివేల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. (లాక్‌డౌన్‌తో సాధించిన ఫలితాలేమిటి?)