https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/05/25/Marriage.jpg?itok=ma77K_0j

లాక్‌డౌన్ ల‌వ్‌: యాచ‌కురాలితో ప్రేమ, ఆపై

కాన్పూర్‌: క‌రోనాను ఎదిరించి మ‌రీ కొంద‌రు పెళ్లి చేసుకుంటున్నారు. అందులో ఉత్త‌ర ప్ర‌దేశ్‌కు చెందిన జంట కూడా ఉంది. కానీ వీరి పెళ్లి ఆన్‌లైన్‌లో జ‌ర‌గ‌లేదు. అలా అని కుటుంబ‌స‌భ్యులు, బంధుగ‌ణాల మ‌ధ్య‌నూ జ‌ర‌గ‌లేదు. అతి సాదాసీదాగా జ‌రిగింది.  వాళ్లు ఒక‌రినొక‌రిని ఇష్ట‌ప‌డ్డారు. కానీ వారి జంట‌ను వ‌రుడి త‌రుపు కుటుంబ‌స‌భ్యులు ఇష్ట‌ప‌డలేదు. కార‌ణం ఆమె ఓ యాచ‌కురాలు. వివ‌రాల్లోకి వెళ్తే.. యూపీకి చెందిన‌ నీల‌మ్‌.. ఓ యాచ‌కురాలు. ఎవరైనా క‌నిక‌రించి కాస్త చిల్ల‌ర వేస్తే త‌ప్ప క‌డుపు నిండేది కాదు. అలాంటిది లాక్‌డౌన్ వ‌ల్ల ఆమె ప‌రిస్థితి మ‌రింత దుర్భ‌రంగా మారింది. ప‌స్తులతోనే కాలం వెళ్ల‌దీస్తోంది. అనిల్ ఓ డ్రైవ‌ర్‌. క‌టిక పేద‌ల‌కు లాక్‌డౌన్ మోసుకొచ్చిన‌ క‌ష్టాల‌ను క‌ళ్లారా చూసి చ‌లించిపోయాడు. వారికి ప‌ట్టెడ‌న్నం పెట్టి క‌డుపు నింపుతున్నాడు. (కేసు వెనక్కి తీసుకోలేదని.. కొట్టి చంపారు)

భిక్ష వ‌దిలి పెళ్లి దిశ‌గా అడుగులు..
అలా ఓ రోజు ఆహారం పంచిపెడుతుండ‌గా కాన్పూర్‌లోని కకాడియో క్రాసింగ్ ద‌గ్గ‌ర ఫుట్‌పాత్ మీద అడుక్కుంటున్న నీల‌మ్‌ను చూశాడు. అందరితోపాటు ఆమెకూ ఆహారం పంపిణీ చేశాడు. ఆమెతో మాట క‌లిపి అన్ని వివ‌రాలు అడిగి తెలుసుకున్నాడు. అలా మొద‌లైన స్నేహం ప్రేమ వ‌ర‌కూ వెళ్లింది. దీంతో ఆమెను యాచ‌క వృత్తి వ‌దులుకోవాల‌ని కోరాడు. అందుకు ఆమె నిండుమ‌న‌సుతో అంగీక‌రించ‌డంతో స్థానిక‌ బుద్ధాశ్ర‌మంలో సామాజిక కార్య‌కర్త‌ల మ‌ధ్య వివాహం చేసుకున్నాడు. ఈ విష‌యం గురించి నీల‌మ్ మాట్లాడుతూ.. "నా తండ్రి కొన్నేళ్ల క్రిత‌మే మ‌ర‌ణించ‌గా త‌ల్లి కొంత‌కాలం క్రితం కాలం చేసింది. ఈ స‌మ‌యంలో అండ‌గా ఉండాల్సిన అన్నావ‌దినలు ఇంటి నుంచి వెళ్ల‌గొట్టారు. దీంతో దిక్కుతోచ‌ని స్థితిలో పొట్ట నింపుకునేందుకు రోడ్ల వెంబ‌డి యాచించ‌డం మొద‌లు పెట్టాను. లాక్‌డౌన్ వ‌ల్ల జీవితం మ‌రింత అగమ్య‌గోచ‌రంగా మారిన స్థితిలో అనిల్ క‌నిపించి, నా జీవితంలో వెలుగులు నింపాడు" అని చెప్పుకొచ్చింది. (గోల్డీ కల్యాణం)