కరోనా: హాస్టళ్లు ఖాళీ చేసి ఇళ్లకు వెళ్లిపోండి!
న్యూఢిల్లీ: లాక్‌డౌన్ సడలింపులతో రవాణా సదుపాయాలు అందుబాటులోకి వచ్చినందున హాస్టళ్లలో చిక్కుకుపోయిన విద్యార్థులు స్వస్థలాలకు వెళ్లాలని ఢిల్లీ జేఎన్‌యూ సోమవారం ప్రకటించింది. ప్రత్యేక రైళ్లు, రాష్ట్ర వ్యాప్త బస్ సర్వీసుల సేవల్ని వినియోగించుకోవాలని సూచించింది. ఈ మేరకు జేఎన్‌యూ హాస్టల్స్ డీన్ ప్రొఫెసర్ సుధీర్ ప్రతాప్‌సింగ్ సర్క్యులర్ జారీ చేశారు. ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయని తెలిపారు.
కోవిడ్ ప్రబలుతున్నందున హాస్టళ్లు ఖాళీ చేసి వెళ్లాలని మార్చి నెలలోనే విద్యార్థులకు చెప్పినట్టు గుర్తు చేశారు. అయితే, పటిష్ట లాక్‌డౌన్ కారణంగా అప్పుడు విద్యార్థులు ఇళ్లకు వెళ్లలేని పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. రాష్ట్ర పరిధిలో రవాణా సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని, జూన్ 1నుంచి ప్రత్యేక రైళ్లు కూడా నడుస్తాయని ప్రతాప్‌సింగ్ సర్క్యులర్‌లో పేర్కొన్నారు. జూన్ చివరి వారం వరకు యూనివర్సిటీ కార్యకలాపాలు పునఃప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని, అప్పటివరకు విద్యార్థులు సొంతూళ్లలోనే ఉండాలని జేఎన్‌యూ వెల్లడించింది.
(చదవండి: పెళ్లితో ఒక్కటైన యాచకురాలు, డ్రైవర్)