ఎయిర్‌టెల్‌లో ప్రమోటర్ల వాటా విక్రయం!
- 2.75 శాతం వాటా అమ్మకానికి సన్నాహాలు
భారతీ ఎయిర్‌టెల్ ప్రమోటరైన భారతీ టెలిమీడియా మంగళవారం బ్లాక్‌డీల్ ద్వారా దాదాపు 100 కోట్ల డాలర్ల విలువైన ఎయిర్‌టెల్ షేర్లను విక్రయించనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. బ్లాక్‌డీల్‌లో భాగంగా 2.75 శాతం వాటాను టెలిమీడియా విక్రయించనుంది. ఈ డీల్‌కు జేపీమోర్గాన్ బ్యాంకర్‌గా వ్యవహరించనుందని, డీల్‌లో భాగంగా ఒక్కో షేరును రూ. 558 చొప్పున విక్రయించనున్నట్లు తెలిసింది. ఈ ధర శుక్రవారం ముగింపు ధర కన్నా దాదాపు 6 శాతం తక్కువ. డీల్‌లో భాగంగా సుమారు 15కోట్ల షేర్లు చేతులు మారతాయి. విక్రయానంతరం ప్రమోటర్లకు 90 రోజుల లాక్‌ఇన్ వర్తించనుంది. విక్రయం ద్వారా వచ్చిన నిధులను అమ్ములు తీర్చేందుకు వినియోగిస్తారని సదరు వర్గాలు తెలిపాయి. డీల్ పూర్తయితే ఎయిర్‌టెల్‌లో ప్రమోటర్లైన భారతీ టెలికం, ఇండియన్ కాంటినెంట్ ఇన్వెస్ట్‌మెంట్, వృందావన్, పాస్టెల్ కంపెనీల వాటా 58.98 శాతం నుంచి 56.23 శాతానికి తగ్గనుంది. గత మూడేళ్లుగా ఎయిర్‌టెల్ వివిధ మార్గాలు వేగంగా నిధుల సమీకరణలు జరిపింది. అనంతరం ఏజీఆర్ రూపంలో ఎదురుదెబ్బ తగిలినా, టారిఫ్‌లు పెంచడం ద్వారా నిలదొక్కుకుంది. దీంతో ఇటీవల కాలంలో షేరు మంచి ర్యాలీ జరిపింది.