https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/05/25/1111.jpg?itok=Z7SRgcJb

పార్మా షేర్లపై మక్కువ పెంచుకున్న మ్యూచువల్‌ ఫండ్లు..!

మ్యూచువల్‌ ఫండ్లు భారతీయ ఫార్మా షేర్లను ఇంతకు ముందు కన్నా అమితంగా ఇష్టపడుతున్నాయి. ఈ క్రమంలో క్యాపిటల్‌ గూడ్స్‌ రంగ షేర్లు మ్యూచువల్‌ ఫండ్ల ఎంపికలో రెండోస్థానానికి దిగివచ్చాయి. ఫార్మా షేర్లకు ఇనిస్టిట్యూషనల్‌ ఎక్స్‌పోజర్‌ 40 నెలల గరిష్ట స్థాయిలో ఉందని మోతీలాల్‌ ఓస్వాల్‌ తెలిపింది. మ్యూచువల్‌ ఫండ్ల పోర్ట్‌ఫోలియోలో ఫార్మా స్టాక్‌ల వెయిటేజీ వార్షిక ప్రాతిపదికన ఈ ఏడాది ఏప్రిల్‌లో 200 బేసిస్ పాయింట్లు పెరిగి 8 శాతానికి చేరుకుంది. ఈ రంగానికి దేశీయ ఫండ్లు ఓవర్‌ వెయిట్‌ను కేటాయించాయి. 

ఏప్రిల్‌లో, ఈ రంగం వెయిటేజ్ మార్చి నెలతో పోలిస్తే 90 బేసిస్ పాయింట్లు పెరిగింది. ఏయూఎం టాప్ 20 ఆస్తి నిర్వహణ సంస్థలలో.. 14 ఫండ్లు ఈ రంగంలో 110-670 బేసిస్ పాయింట్ల మేర ఓవర్‌ వెయిట్‌ను కలిగి ఉన్నాయి. ఆదిత్య బిర్లా ఏఎంసీ ఫార్మా రంగానికి అత్యధికంగా 12.9శాతం కేటాయింపులను కలిగి ఉంది. తరువాత ఎల్అండ్‌టీ, కెనరా రోబెకో మ్యూచువల్‌ ఫండ్‌లు తమ పోర్ట్‌ ఫోలియోలో వరుసగా 12.4శాతం, 11.7 శాతం కేటాయింపులు చేశాయి. 

అన్ని రంగాలతో పోలిస్తే ఫార్మా రంగం అత్యల్ప ఆదాయ డౌన్‌గ్రేడ్‌ను చూసింది. జెనరిక్ వ్యాపారానికి సంబంధించి యూఎస్‌ మార్కెట్లో వ్యాపార అవుట్‌లుక్‌ క్రమంగా మెరుగుపడిన తరువాత కొన్ని షేర్ల ఆదాయాలు మరింత పెరిగాయి. ఫార్మా కంపెనీలకు వచ్చే మొత్తం ఆదాయంలో మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ ఎగుమతులే ఉండటం విశేషం.

ఔషధాల అనుమతులు పెరుగుదల, ఉత్పత్తులు పెరగడం, అనుకూలమైన కరెన్సీ కదలికలు తదితర అంశాలు ఫార్మా కంపెనీలపై అంచనాలను పెంచుతున్నాయి. అమెరికాలో ఔషధ ఉత్పత్తుల త్రైమాసిక అమ్మకాలు 1.66- 1.75 బిలియన్‌ డాలర్ల పరిధిలో ఉన్నాయి. ఇది ధర ఒత్తిడి తగ్గిందని సూచిస్తుంది. పర్యవసానంగా, ఫార్మా కంపెనీల షేర్ల ధరల్ని వారు రీ-రేట్‌ చేస్తాయి.

ఈ ఏడాది ప్రారంభంలో నిఫ్టీ సూచీతో పోలిస్తే నిఫ్టీ ఫార్మా ఇండెక్స్‌ 8శాతం డిస్కౌంట్‌తో ట్రేడ్‌ అ‍య్యేది. ఇప్పుడు నిఫ్టీ ఫార్మా 41.6శాతం ప్రీమియంతో ట్రేడ్‌ అవుతోంది. నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ గత మూడు నెలల్లో సెన్సెక్స్‌ను 41శాతం మేర అధిగమించింది. ఇదే కాలంలో సానుకూల రాబడిని అందించే కొన్ని ఇండెక్స్‌ల్లో ఒకటిగా నిలిచింది.