విమానాల్లో ఆ సీట్లు ఖాళీగా ఉంచండి: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: భారత అత్యున్నత న్యాయస్థానం విమానయానంపై కీలక వ్యాఖ్యలు చేసింది. విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను వెనక్కి రప్పించేందుకు నడుస్తున్న అంతర్జాతీయ విమానాల్లో మధ్య సీట్లను తప్పనిసరిగా ఖాళీగా ఉంచాలని స్పష్టం చేసింది. కరోనా వ్యాప్తి నివారణకు సామాజిక దూరం పాటించడం తప్పనిసరి అని పేర్కొంది. వాణిజ్య విమానయాన సంస్థల కన్నా పౌరుల ఆరోగ్యం గురిచి ప్రభుత్వాలు ఆందోళన చెందితే బాగుంటుందని ఘాటు వ్యాఖ్యలు చేసింది. మే 7న ప్రారంభమైన వందే భారత్ మిషన్‌లో భాగంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను ఎయిర్ ఇండియా వెనక్కి రప్పిస్తోన్న విషయం తెలిసిందే. అయితే మధ్య సీట్లను భర్తీ చేయడంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 'బహిరంగ ప్రదేశాల్లో ఆరు అడుగుల దూరం పాటించాలంటున్నారు. మరి విమానం లోపల ఏం చేస్తున్నారు?' అని ప్రశ్నించారు. (ఆ కుటుంబానికి రూ.7.64 కోట్లివ్వండి)
దీనిపై కేంద్రం తరపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ.. సీట్లు వదిలేయడం కాన్నా టెస్టింగ్, క్వారంటైన్ అత్యుత్తమ విధానాలని, నిపుణుల సలహా మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని కోర్టుకు వివరించారు. ఆయన వ్యాఖ్యలతో విభేదించిన కోర్టు విమాన ప్రయాణికులకు వైరస్ సోకదని ఎలా చెప్పగలరని ప్రశ్నించింది. జూన్ 6 వరకు బుకింగ్స్ జరిగాయని తుషార్ పేర్కొనగా.. ఆ తర్వాతి నుంచి మధ్య సీట్లు బుకింగ్ చేయడానికి వీల్లేదని ఆదేశించింది. కావాలనుకుంటే దేశీయ విమానాల్లోనూ ఈ సమస్య గురిచి హైకోర్టులు జూన్ 2న విచారించవచ్చని న్యాయస్థానం సూచించింది. కాగా నేటి నుంచి దేశీయ విమానయానం పునఃప్రారంభమవుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సర్వీసులను కొన్ని రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికే కరోనా కేసులు ఎక్కువగా ఉన్నందున అవి మరింత విజృంభించే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నాయి. (నేటి నుంచి టేకాఫ్..)