‘ఉస్సెన్ బోల్ట్ కూడా నన్ను పట్టుకోలేడు’
కింగ్ కోబ్రా పేరు వింటేనే కాళ్లల్లో వణుకు, గుండెల్లో దడ వచ్చేస్తాయి. దాన్ని దగ్గర నుంచి చూడటం అంటే ప్రాణాల మీద ఆశ వదిలేసుకోవడం లాంటిదే. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన సర్పం కింగ్ కోబ్రా. దాని పేరు తలుచుకోవడానికే మనం వణికిపోతుంటే ఓ వ్యక్తి మాత్రం ఏకంగా దానికి తలస్నానం చేయిస్తున్నాడు. వినడానికి ఏ మాత్రం నమ్మశక్యంగా లేకపోయినా ఇది మాత్రం పచ్చి నిజం. వివరాలు.. కేరళకు చెందిన వావా సురేష్ అని వ్యక్తి పాములను పట్టడంలో, వాటిని పరిరక్షిచడంలో నిపుణులు. ఈ నేపథ్యంలో సురేష్ కింగ్ కోబ్రాకు తల స్నానం చేయించాడు. ఓ బకెట్‌లో నీళ్లు తెచ్చి కింగ కోబ్రా తల మీద పోస్తాడు. ఆ పాము నీళ్లు పోసిన వ్యక్తిని ఏమి అనకుండా, ఎలాంటి భావాలు పలికించకుండా కామ్‌గా ఉంటుంది. అలా రెండు బక్కెట్ల నీటిని పోసి కింగ్ కోబ్రాకు తలస్నానం చేయిస్తాడు సురేష్. ఇందుకు సంబంధించిన వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత నంద తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
‘వేసవి కాలం.. తలస్నానం ఎవరికి ఇష్టం ఉండదు. అయితే ఇలాంటివి చాలా ప్రమాదం. ఇంటి దగ్గర ప్రయత్నించకండి’ అంటూ ఈ వీడియోను ట్వీట్ చేశారు సుశాంత నంద. దాదాపు 51 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోను ఇప్పటికే 70 వేల మంది పైగా వీక్షించారు. ‘నిజంగా అతడి ధైర్యాన్ని మెచ్చుకుని తీరాల్సిందే.. ఈ వీడియో చూసి నేను పరిగెట్టడం మొదలు పెట్టాను. ఉస్సెన్ బోల్ట్ సైతం నన్ను పట్టుకోలేడు’ అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. భూమి పైన ఉన్న పొడవైన విషపు పాముల జాతి. నేషనల్ జీయోగగ్రాఫిక్ వారు చెప్పిన దాని ప్రకారం ఈ పాము నిలబడటమే కాక తన కళ్లతో పూర్తిగా ఎదిగిన ఓ మనిషిని చూడగలదు. దీని ఒక్క కాటులో వెలువడే విషంతో 20 మందిని ఒక్కసారే చంపవచ్చు.