స్పెషల్ కేటగిరీ.. ఒంటరిగా విహాన్
బెంగళూరు : కరోనా లాక్‌డౌన్‌తో పలువురు తమ కుటుంబాలకు దూరంగా వేర్వేరు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. నేటి నుంచి దేశీయ విమాన సర్వీసులు ప్రారంభం కావడంతో.. చాలా మంది తమ కుటుంబ సభ్యులను కలుసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఓ ఐదేళ్ల బాలుడు ఢిల్లీ నుంచి బెంగళూరుకు ఒంటరిగా ప్రయాణించి తన తల్లిని కలుసుకున్నాడు. దాదాపు మూడు నెలల తర్వాత తన కొడుకును చూశానని ఆ బాలుడి తల్లి చెప్పారు.
వివరాల్లోకి వెళితే.. ఐదేళ్ల విహాన్ శర్మ రెండు నెలల కిత్రం ఢిల్లీలోని తన బంధువుల ఇంటికి వెళ్లాడు. కరోనా వ్యాప్తిని నియంత్రించడంలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో విహాన్ అక్కడే ఉండిపోయాడు. అయితే సోమవారం నుంచి విమాన రాకపోకలు మొదలుకావడంతో.. ఢిల్లీలో ఫ్లైట్ ఎక్కి బెంగళూరు చేరుకున్నాడు. విహాన్ కోసం అతని తల్లి ఉదయం నుంచే కెంపెగౌడ ఎయిర్‌పోర్ట్‌లో ఎదురుచూశారు. కొడుకు రావడంతో అతన్ని దగ్గరికి తీసుకుని మురిసిపోయారు. ఇందుకు సంబంధించి విహాన్ తల్లి మాట్లాడుతూ.. తొలి ఫ్లైట్‌లోనే విహాన్‌ను రప్పించేందుకు ఏర్పాటు చేశామని చెప్పారు. ఢిల్లీలోని తమ బంధువులు విహాన్ ఫ్లైట్ ఎక్కించగా.. స్పెషల్ కేటగిరీ కింద విహాన్ ఫ్లైట్‌లో ప్రయాణించాడని తెలిపారు. అయితే విమానంలో ప్రయాణించేటప్పుడు ముఖానికి మాస్క్, చేతులకు గ్లౌస్‌లు ధరించిన విహాన్.. కరోనా నిబంధనలు పాటించి పలువురికి ఆదర్శంగా నిలిచాడు.