గీసుకొండ హత్యల మిస్టరీని చేధించిన పోలీసులు
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంటలో 9మంది అనుమానాస్పద మృతి కేసును పోలీసులు చేధించారు. తొమ్మిది మందిని హత్య చేసినట్టు పోలీసులు తేల్చారు.
మృతుడు మక్సూద్ ఆలం కుమార్తె బుష్రా ప్రియుడిగా చెబుతున్న సంజయ్‌కుమార్ యాదవ్ ఈ హత్యలు చేసినట్టు నిర్ధారణ అయింది. తన స్నేహితులతో కలిసి ఈ హత్యలు చేసినట్టు దాదాపు నిర్ధారించారు. పోలీసుల విచారణలో నేరాన్ని సంజయ్ కుమార్ యాదవ్ అంగీకరించినట్టు చెబుతున్నారు.
తొలుత కూల్‌డ్రింక్స్‌లో మత్తు మందు ఇచ్చి వారంతా అపస్మారక స్థితికి చేరగానే తీసుకెళ్లి బావిలో పడేశారు. సంజయ్‌కుమార్ యాదవ్‌కు సహకరించిన స్నేహితుల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఇప్పటికే సంజయ్‌తో పాటు యాకూబ్, మంకుషా, మక్సూద్ మరదలు, ఓఆటో డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఈ హత్యలకు వివాహేతర సంబంధమే కారణమై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మక్సూద్ కుమార్తె బుష్రాకు నిందితుడు సంజయ్ కుమార్ యాదవ్‌కు మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో ఆమెను తల్లి తీవ్రంగా మందలించడంతో గొడవ జరిగింది.
ఈ గొడవలో బీహార్‌కు చెందిన శ్రీరాం, శ్యామ్‌లు జోక్యం చేసుకోవడంతో పాటు బుష్రాపై కన్నేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో పథకం ప్రకారం హత్యలకు సంజయ్ కుమార్ నిర్ణయించుకుని అమలు చేశాడు.
మహ్మద్ మక్సూద్ ఆలం గోనె సంచులు కుడుతూ జీవనం గడుపుతున్నా ఇటీవలే ఖరీదైన ప్లాట్లు కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. చనిపోవడానికి రెండు రోజుల ముందు రూ. 25 వేల విలువైన సామగ్రిని కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అన్నదానిపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు.