https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/05/25/kmm.jpg?itok=8qaPvpI0
భద్రాచలంలో లాక్‌డౌన్‌తో మూసివేసిన ఏషియన్‌ ఉదయ్‌ భాస్కర్‌ థియేటర్‌

బొమ్మ ఆడక.. పూట గడవక..



కొత్తగూడెం టౌన్‌/భద్రాచలంఅర్బన్‌: వినోదంతో పాటు మానసికోల్లాసాన్ని పంచే సినిమా థియేటర్లు కరోనా లాక్‌డౌన్‌తో మూతపడ్డాయి. దీంతో సినిమా హాళ్లలో పనిచేసే కార్మికులకు ఇక్కట్లు తప్పడం లేదు. వేతనాలు రాక, చేతిలో చిల్లిగవ్వ లేక కుటుంబాలను పోషించుకోలేకపోతున్నారు. జిల్లా కేంద్రం కొత్తగూడెంలో 5, పాల్వంచలో 3, ఇల్లెందులో 3, అశ్వారావుపేటలో 4, మణుగూరులో 2, సారపాకలో 1, భద్రాచలంలో 2, చర్లలో 2 చొప్పున, జిల్లాలో మొత్తం 22 థియేటర్లు ఉన్నాయి. గత మార్చి 23న లాక్‌డౌన్‌ ప్రకటించడంతో థియేటర్లు మూతపడ్డాయి. దీంతో వాటిల్లో పని చేసే వర్కర్లు ఇక్కట్లు పడుతున్నారు. ఒక్కో థియేటర్‌లో 20 నుంచి 25 మంది వరకు పని చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా సుమారు 500 మంది వరకు సినిమా హాళ్లపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. థియేటర్లు పని చేయక పోవడంతో ఆయా కుటుంబాలు రెండు నెలలుగా అవçస్థ పడుతున్నాయి. దాతలు సైతం థియేటర్లలో పని చేసే వర్కర్లను గుర్తించకపోవడంతో దీనస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.

యాజమాన్యాలకూ నష్టమే..
ప్రతిఏటా వేసవిలో థియేటర్లకు ప్రేక్షకులు అధికంగా వస్తుంటారు. దీంతో యజమానులు లాభాలను ఆర్జిస్తుంటారు. కానీ కరోనా కారణంగా ఈ వేసవిలో మార్చి నెల నుంచి థియేటర్లు మూతపడ్డాయి. ఇప్పట్లో థియేటర్లను నడిపించడానికి అనుమతులు లభించడం కష్టంగానే మారింది. దీంతో యాజమాన్యాలు కోలుకోలేని పరిస్థితి నెలకొంది.

ఇబ్బందులు పడుతున్నాం
20 ఏళ్లుగా సినిమా హాల్‌లో పని చేస్తున్నాను. నాకు తెలిసి ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి రాలేదు. థియేటర్‌ రిపేరు చేసినప్పుడు పది రోజుల్లో పూర్తి చేసే వాళ్లం. కరోనా లాక్‌డౌన్‌తో థియేటర్‌ మూత పడింది. చాలా ఇబ్బందులు పడుతున్నాం.– వెంకటేశ్వర్లు,ఏఎమ్మార్‌ సినిమాస్‌ ఆపరేటర్,భద్రాచలం

పట్టించుకునే వాళ్లే లేరు
సినిమా థియేటర్లలో పని చేసే వారిని పట్టించుకునే వాళ్లే లేరు. థియేటర్లు నడిస్తేనే మాకు జీవనోపాధి. లాక్‌డౌన్‌తో కుటుంబాలను పోషించడం కష్టంగా మారింది. ప్రభుత్వం చొరవ చూపి నగదు సాయాన్ని అందించాలి.–ప్రసాద్, శాంతి థియేటర్‌ మేనేజర్, పాల్వంచ

యాజమాన్యాలు ఆర్థికంగా ఆదుకోవాలి
సినిమాహాల్‌ వర్కర్లను ప్రభుత్వం, యాజమాన్యాలు ఆదుకోవాలి. రెండు నెలలుగా నిత్యావసర వస్తువులకు కూడా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. కార్మికుల కుటుంబాలకు అండగా నిలవాలి.–సీహెచ్‌. రాంనారాయణ, తెలంగాణ సినిమా హాల్స్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు

ఖాళీగా ఉంటున్నాయి..
సినిమాహాల్స్‌ ప్రేక్షకులు లేక ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. కార్మికుల కోసం ప్రత్యేకంగా కార్యక్రమం రూపొందించి వారిని ప్రభుత్వం, యాజమాన్యాలు ఆదుకునేలా చర్యలు తీసుకోవాలి.–సునీల్,పూర్ణ థియేటర్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌

♦ సినిమాహాళ్లలో పని చేస్తున్న గేట్‌ కీపర్‌కు రూ.8500 నుంచి రూ.10 వేల వరకు, ఆపరేటర్లకు రూ.9,500లు, బుకింగ్‌ కార్మికులకు రూ. 8 వేలు ఇస్తారు.
♦ కార్మికుల వేతనాలు చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించినా సొంతంగా సినిమాహాళ్లు నిర్వహిస్తున్న వారు కొందరు వేతనాలను ఇచ్చేందుకు ఇబ్బందులు పెడతున్నారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
♦ కార్పొరేట్‌ సంస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న థియేటర్ల యాజమాన్యాలు వేతనాలు చెల్లిస్తున్నాయని చెబుతున్నారు.