https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/05/25/lockdown.jpg?itok=iUAOBmNe
ప్రతీకాత్మక చిత్రం

‘రీ ఓపెన్‌ అమెరికా’పై బాట్స్‌ ఉద్యమం

న్యూయార్క్‌ : ‘రీ ఓపెన్‌ అమెరికా’ ఉద్యమం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘రీ ఓపెన్‌ అమెరికా’ ఉద్యమం పేరిట కరోనా వైరస్‌పై ట్విటర్‌లో చర్చలకు దిగుతున్న అకౌంట్లలో సగానికిపైగా ఖాతాలు ఆటోమేటెడ్‌ బాట్స్‌కు చెందినవని పరిశోధకులు చెబుతున్నారు. ట్విటర్‌ బాట్స్‌ ద్వారా వెలువడ్డ తప్పుడు ప్రచారాల ద్వారా ట్విటర్‌లో ఎక్కువమంది ‘‘కరోనా స్టే యాట్‌ హోమ్‌’’ ఆర్డర్స్‌పై చర్చలకు దిగుతున్నారని ‘‘కార్నెజీ మెలన్‌ యూనివర్శిటీ’’ వెల్లడించింది. దాదాపు 200 మిలియన్ల ట్వీట్ల చర్చలను పరిశోధకులు పరిశీలించగా.. 82 శాతం టాప్‌ 50 ప్రేరేపిత ట్వీటర్లు.. 62శాతం టాప్‌ 1000 రీ ట్వీటర్లను బాట్స్‌గా గుర్తించింది. మనుషులకు చెందిన ఆ ఖాతాలు బాట్‌ సహాయంతో 66 శాతం ట్వీట్లు చేయబడ్డాయని తేల్చారు. ( అమెరికాలో రాజకీయ వైరస్‌ వ్యాపిస్తోంది)

దీనిపై పరిశోధకులు మాట్లాడుతూ.. ‘‘మామూలుగా బాట్స్‌కు ఓ నిర్థిష్టమైన అర్థం అంటూ ఏదీ లేదు. కంప్యూటర్‌ ద్వారా రూపొందించబడ్డ సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామ్‌ను బాట్స్‌ అనొచ్చు. అది మనిషి సహాయం లేకుండా ఆటోమేటిక్‌గా ట్వీట్లను, రీట్వీట్లను చేస్తుంది. ఈ పద్ధతి ప్రకారం ఓ మనిషి కొన్ని వేల ట్విటర్‌ ఆకౌంట్లను కంట్రోల్‌ చేయగలడు. మేము ట్విటర్‌ బాట్స్‌ను కనుగొనడానికి వివిధ రకాల పద్ధతులను ఉపయోగించాము. చాలా దేశాలు విరివిగా ట్విటర్‌ బాట్స్‌ను ఉపయోగిస్తున్నాయి. ముఖ్యంగా రాజకీయాలకు సంబంధించిన విషయాల్లో. రీఓపెనింగ్‌ అమెరికా విషయంలో అర్థంలేని కుట్రపూరిత సిద్ధాంతాలు ట్వీట్ల రూపంలో వెలువడ్డాయి. ఇలాంటి ట్వీట్ల ద్వారా ప్రజల్లో అభద్రతా భావం పెరుగుతుంది. తప్పుడు ప్రచారం చేసే వారి ప్రధాన ఉద్ధేశ్యం కూడా అదే. కానీ, అన్ని బాట్స్‌ చెడ్డవని చెప్పలేము’’అని పేర్కొన్నారు.