https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/05/25/MS-Dhoni.jpg?itok=uc8rbBIq

‘ఎంఎస్‌ ధోనిని ఫాలో అవుతా’



ఢాకా: భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనికి తాను పెద్ద అభిమానిని అంటున్నాడు బంగ్లాదేశ్‌ టీ20 కెప్టెన్‌ మహ్మదుల్లా. తనకు ధోని కెప్టెన్సీ అన్నా, అతని బ్యాటింగ్‌ అన్నా ఎంతో ఇష్టమని పేర్కొన్నాడు. ఓవరాల్‌గా చెప్పాలంటే తాను ధోనికి పెద్ద అభిమానినని మహ్మదుల్లా తెలిపాడు. ‘ ధోని మైదానంలో ఆడే తీరు ముచ్చటగా ఉంటుంది. ప్రత్యేకంగా ధోని హిట్టింగ్‌ చేసే సందర్భాల్లో కంట్రోల్డ్‌ షాట్లు ఆడుతూ ఉంటాడు. అవి చాలా ఆసక్తికరంగా ఉంటాయి. అతను కొట్టే కొట్టే హెలికాప్టర్‌ షాట్లను ప్రత్యేకంగా గమనిస్తూ ఉంటా. ధోని ఆడిన పాత మ్యాచ్‌లే కాకుండా లైవ్‌ మ్యాచ్‌లు కూడా చూస్తూ ఉంటాను. (తొందరెందుకు.. కాస్త ఆగి చూడండి: మిస్బా)

ధోని గేమ్‌పై ఆధిపత్యం చెలాయిస్తూ మెల్లగా నియంత్రణలోకి తెచ్చుకునే విషయాన్ని ఎక్కువగా పరిశీలిస్తా. నేను కెప్టెన్సీ చేసే సందర్భాల్లో ధోనిని ఫాలో అవుతా. అటు బ్యాటింగ్‌ విషయంలోనే కాదు.. కెప్టెన్సీ విషయంలో కూడా ధోనిని అనుసరిస్తూ ఉంటా’ అని మహ్మదుల్దా తెలిపాడు. ఇక వన్డే ఫార్మాట్‌లో ధోని బ్యాటింగ్‌ యావరేజ్‌ యాభైకి పైగా ఉండటాన్ని మహ్మదుల్లా ప్రధానంగా ప్రస్తావించాడు. వన్డే క్రికెట్‌లో యాభైకి పైగా యావరేజ్‌ కల్గి ఉండటం అంత ఈజీ కాదన్నాడు. స్టైక్‌రేట్‌ విషయానికొస్తే దాదాపు 90 ఉండటం అతనికి గేమ్‌పై ఉన్న పట్టును చూపెడుతుందన్నాడు. తన క్రికెట్‌ ఎరీనాలో అత్యధిక ప్రభావం చూపిన క్రికెటర్‌ ధోనినేనని మహ్మదుల్లా పేర్కొన్నాడు. బంగ్లాదేశ్‌ ఆల్‌రౌండర్‌ షకీబుల్‌ హసన్‌పై రెండేళ్లు వేటు పడిన నేపథ్యంలో టీ20 కెప్టెన్‌గా మహ్మదుల్లాను ఎంపిక చేశారు. ఇప్పుడు షకీబుల్‌ వారసుడిగా జట్టును నడిపిస్తున్నాడు మహ్మదుల్లా. కాగా, మహ్మదుల్లాలో ధోని కెప్టెన్సీ తరహా లక్షణాలను మాజీ ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ గుర్తించిన విషయం తెలిసిందే. ఇటీవల ఒకానొక సందర్భంలో ఇర్ఫాన్‌ మాట్లాడుతూ.. మహ్మదుల్లా కెప్టెన్సీ అచ్చం ధోని సారథ్యాన్ని పోలి ఉంటుందన్నాడు. (టి20 ప్రపంచకప్‌పై నిర్ణయం తీసుకోండి)