https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/05/25/south-china-sea.jpg?itok=2NEzlj0m

ఆ ఆరోపణలు అర్థం లేనివి : చైనా

బీజింగ్‌ : దక్షిణ చైనా సముద్రంపై పట్టు కోసం చైనా కరోనా వైరస్‌ వ్యాప్తిని ఉపయోగిస్తుందనే వార్తలను ఆ దేశం కొట్టిపారేసింది. ఆ ఆరోపణలు పూర్తిగా అర్థం లేనివని చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీ తెలిపారు. ఆదివారం రోజున ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. దక్షిణ చైనా సముద్రంలో సామ్రాజ్యాన్ని విస్తరించడం కోసం.. చైనా కరోనా వ్యాప్తిని విస్తరిస్తుందనడంలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. వైరస్‌ నిరోధానికి సంబంధించి చైనా.. ఆగ్నేయ ఆసియా దేశాలతో కలిసి పనిచేస్తుందని చెప్పారు. అయితే కొందరు మాత్రం చైనాపై దుష్ప్రచారం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని మండిప్డారు. 

మిలటరీ విమానాలు మోహరించడం, సముద్రంలో గస్తీ నిర్వహించడంతో అస్థిరత సృష్టించేందకు కొన్ని దేశాలు ప్రయత్నిస్తున్నాయని అమెరికా దాని మిత్రదేశాలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. చైనా, ఆగ్నేయ ఆసియా దేశాల మధ్య వివాదాలు రేకెత్తించడం కోసమే ఇటువంటి నీచమైన ఆలోచనలు చేస్తున్నారని మండిపడ్డారు. కాగా, దక్షిణ చైనా సముద్రంపై పట్టు కోసం చైనా చాలా కాలంగా ప్రయత్నిస్తుందనే విమర్శలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో పెద్ద మొత్తంలో చమురు, సహజవాయువు నిక్షేపాలు ఉన్నాయని అంతా భావిస్తున్నారు. ఈ వివాదాస్పద ప్రాంతం నౌకల రవాణాకు కీలకమైనది కూడా. ఈ ప్రాంతం మీద అధిపత్యం కోసం చైనా, వియత్నాం, ఫిలిప్పీన్స్‌, తైవాన్‌, బ్రూనై దేశాల మధ్య వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం కరోనా సంక్షోభం నెలకొన్న సమయంలో చైనా ఆ ప్రాంతంపై అధిపత్యం కోసం ప్రయత్నాలు ముమ్మురం చేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో కూడా దక్షిణ చైనా సముద్రంలోని వివాదాస్పద ప్రాంతంలో చైనా తన ప్రాదేశిక ఆశయాల కోసం ప్రయత్నిస్తోందని ఆరోపించిన సంగతి తెలిసిందే.(చదవండి : అమెరికాలో రాజకీయ వైరస్‌ వ్యాపిస్తోంది)