లాక్‌డౌన్ ఉల్లంఘన.. నటుడిపై తుమ్మిన వ్యక్తి!
ప్రముఖ హిందీ కమెడియన్ వీర్ దాస్ గురించి సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరలవుతోంది. లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వీర్ దాస్‌పై ఓ సామాన్యుడు తుమ్మాడు అంటూ వార్తలు ప్రచారం అవుతున్నాయి. అయితే ఈ వార్తలను వీర్ దాస్ ఖండించాడు. కాకపోతే సదరు వ్యక్తి తనను వేధించాడని.. బెదిరింపులకు దిగాడని తెలిపాడు. ఇందుకు సంబంధించి ఓ వీడియోను తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు వీర్ దాస్. ఈ వీడియోలో ఓ పెద్ద వయసు వ్యక్తి వీర్‌ను తిడుతూ.. బెదిరిస్తూ ఉంటాడు. ఒకానొక సమయంలో అతడి మీద తుమ్మడానికి కూడా ప్రయత్నిస్తాడు. తర్వాత కనీసం ఆరు అడుగుల సామాజిక దూరాన్ని పాటించమని వీర్ దాస్‌ను కోరడం వీడియోలో చూడవచ్చు.(‘ఆ విషయంలో దీపిక చాలా క్రూరం’)
అనంతరం వీర్‌దాస్ దీని గురించి మాట్లాడుతూ.. ‘తాజాగా మా అపార్ట్‌మెంట్లో ఓ రోజు సాయంత్రం చిన్న సిటప్ ఏర్పాటు చేశాం. అందరికి అక్కడే భోజనం ఏర్పాట్లు చేశాం. ప్రతి ఒక్కరం 15 అడుగుల దూరంలో కూర్చున్నాం. అందరం సామాజిక దూరం పాటించాము. నేను సిగరెట్ తాగడానికి కిందకు వచ్చాను. ఆ తర్వాత 5 నిమిషాలకు వీడియోలో ఉన్న సంఘటన చోటు చేసుకుంది. వీడియోలో ఉన్న వ్యక్తి నేను ఉంటున్న అపార్ట్‌మెంట్‌లోనే మొదటి అంతస్తులో ఉంటున్నాడు. అతను ఆ ఇంటి యజమాని కాదు. మా యజమాని నేను ఉంటున్న ఇంటిని వారసత్వంగా పొందాడు. నేను కూర్చున్న స్థలం, నా ఇల్లు ఏది అతని సొంతం కాదు. అన్నింటికి మించి ఓ వృద్ధుడు నా మీద తుమ్ముతాడని నేను అనుకోవడం లేదు’ అన్నాడు. (బాలీవుడ్‌ను వదలని కరోనా..)
వీర్‌దాస్ మాట్లాడుతూ.. ‘కానీ మీడియాలో వస్తున్న వార్తలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. మొదట్లో వీటిని నేను పట్టించుకోలేదు. కానీ పరిస్థితి చేయి దాటుతుండటంతో దీని గురించి మాట్లాడాల్సి వస్తుంది. మీ లాక్‌డౌన్ ఎలా ఉంది’ అంటూ వీర్ ట్వీట్ చేశారు. దీనిపై పలువురు సెలబ్రిటీలు కామెంట్ చేశారు. జాగ్రత్తగా ఉండమంటూ వీర్‌కు సలహా ఇచ్చారు.