మృతదేహాన్ని అడ్డుకున్న గ్రామస్తులు
- ఏపీలోని అద్దంకిలో కానాయపల్లి వాసి మృతి
- కరోనా సోకిందనే అనుమానం
- అధికారుల హామీతో శాంతించిన వైనం
మహబూబ్‌నగర్, కొత్తకోట రూరల్: కరోనా వైరస్ సోకి మృతిచెందాడనే అనుమానంతో ఇతర రాష్ట్రంలో చనిపోయిన ఓ వ్యక్తి మృతదేహాన్ని గ్రామంలోకి తీసుకురాకుండా గ్రామస్తులు అడ్డుకోవటంతో గ్రామ శివారులోనే దహన సంస్కారాలు నిర్వహించారు. గ్రామస్తుల కథనం మేరకు.. మండలంలోని కానాయపల్లికి చెందిన వడ్డె వెంకటయ్య(55), భార్య వెంకటమ్మతో కలిసి బతుకుదెరువు కోసం ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా అద్దంకి వలసవెళ్లాడు. గత నెల పసిరికలు కావటంతో అక్కడే చికిత్స పొందుతుండగా శుక్రవారం మృతి చెందాడు. ఆదివారం ఉదయం గ్రామానికి తీసుకొస్తుండగా విషయం తెలుసుకున్న గ్రామస్తులు గ్రామశివారులో అడ్డుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఎక్కువగా ఉందని, మృతదేహాన్ని ఎట్టిపరిస్థితుల్లో గ్రామంలోకి తీసుకురావద్దని కోరారు. తహసీల్దార్ రమేశ్‌రెడ్డి, ఎస్‌ఐ నాగశేఖర్‌రెడ్డి జోక్యం చేసుకొని వెంకటయ్య భార్య వెంకటమ్మకు కరోనా పరీక్షలు నిర్వహించి నెగెటివ్ రావటంతో అంత్యక్రియలు చేసేందుకు గ్రామస్తులు ఒప్పుకోగా గ్రామ శివారులో అంత్యక్రియలు పూర్తి చేశారు.