యంత్ర సిద్ధి.. చేకూరేనా లబ్ధి!
- లాక్‌డౌన్ సడలింపుతో తెరుచుకున్న కంపెనీలు
- గ్రేటర్లో 40వేలకుపైగా చిన్నతరహా పరిశ్రమలు
- వెంటాడుతున్న ముడిసరుకు కొరత
- అందుబాటులోని లేని నైపుణ్య కార్మికులు
- భారంగా మారిన విద్యుత్ బకాయిలు
- పెట్టుబడులు లేక ఆర్థిక సమస్యలు
- ప్రభుత్వ ప్యాకేజీపైనే యాజమాన్యాల ఆశలు
సాక్షి, సిటీబ్యూరో: సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు కష్టకాలం వచ్చింది. లాక్‌డౌన్ ఆంక్షల సడలింపుతో ఇవి తెరుచుకున్నా.. మనుగడ మాత్రం ప్రశ్నార్థకంగా పరిణమించింది. ఒకవైపు ముడిసరుకు కొరత సమస్య వెంటాడుతుండగా.. మరోవైపు నైపుణ్య కార్మికులు అందుబాటులో లేకపోవడంతో మరింత కుంగదీస్తోంది. దీంతో వివిధ పరిశ్రమల్లో ఉత్పత్తులు ముందుకు సాగని పరిస్థితి నెలకొంది. రెండు నెలలుగా పరిశ్రమలు మూతపడటంతో చిరు పారిశ్రామికవేత్తలను ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నాయి. తాజాగా భవనాల అద్దె, విద్యుత్ బకాయిల చెల్లింపు, కార్మికుల వేతనాలు, ఇతరత్రా ఖర్చులు తలకు మించిన భారంగా మారాయి. ఇప్పటికే అరకొర వర్క్ ఆర్డర్లతో నష్టాల బాటలో నడుస్తున్న చిన్నతరహా పరిశ్రమలకు లాక్‌డౌన్‌తో కష్టాలు మరింత రెట్టింపయ్యాయి. ముఖ్యంగా భారీ పరిశ్రమల్లో ఉత్పత్తులు నిలిచిపోయాయి. వీటిపై ఆధారపడిన చిన్న పరిశ్రమలు ఆగమయ్యాయి. అప్పటికే తయారు చేసి గోడౌన్లలో ఉంచిన సరుకును కొనే దిక్కు లేకుండాపోయింది. మరోవైపు ముడిసరుకు కొరత, ఆర్డర్లు లేకపోవడంతో పరిశ్రమలపరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. దివాలా అంచున నడుస్తున్న చిన్న పరిశ్రమలపై కరోనా విపత్తు తీవ్ర ప్రభావం చూపింది.
నిలిచిపోయిన సరఫరా..
చిన్న, సూక్ష్మతరహా పరిశ్రమలను ముడిసరుకు కొరత వెంటాడుతోంది. లాక్‌డౌన్‌తో పరిశ్రమల ఉత్పత్తి, ముడి సరుకు సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. సాధారణంగా మార్చి నెల తర్వాత పెద్దఎత్తున వర్క్ ఆర్డర్లు వచ్చేవి. దీంతో ముడి సరుకులకు డిమాండ్ ఎక్కువగా ఉండేది. కానీ కోవిడ్ పరిస్థితుల ప్రభావంతో ఆయా పరిశ్రమల్లో ముడిసరుకు ఉత్పత్తులు నిలిచిపోయాయి. ఫలితంగా సరఫరా ఆగిపోయింది. తాజాగా చిన్న పరిశ్రమలకు వర్క్ ఆర్డర్లు వస్తున్నా.. ముడిసరుకు అందుబాటులో లేకుండా పోయింది. కొన్ని పరిశ్రమల్లో పాత ముడిసరుకు నిల్వలు అందుబాటులో ఉన్నప్పటికీ వర్క్ ఆర్డర్లు లేకుండా పోయాయి. సూక్ష పరిశ్రమలు చాలా వరకు భారీ పరిశ్రమల జాబ్ ఆర్డర్లపై ఆధారపడి మనుగడ సాగిస్తుంటాయి. భారీ పరిశ్రమలు కూడా నష్టాల ఊబిలో ఉండటంతో సూక్ష్మ పరిశ్రమలకు వర్క్ ఆర్డర్లు లేకుండా పోయాయి.
నైపుణ్యాల కొరత..
ఆయా పరిశ్రమలకు నైపుణ్య కార్మికుల కొరత ఏర్పడింది. లాక్‌డౌన్ కారణంగా ఇతర రాష్ట్రాలకు చెందిన వివిధ ట్రేడ్స్‌లో› నైపుణ్యం కలిగిన కార్మికులు స్వస్థలాల బాటపట్టారు. ప్రస్తుతం 20 శాతానికి మించి నైపుణ్యం కలిగిన కార్మికులు లేకుండాపోయారు. దీంతో ఉత్పతులు పునఃప్రారంభించేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. కార్మికులపరంగా ఎలా నిలదొక్కుకుని నడిపించాలో అర్థం కాని పరిస్ధితి నెలకొంది. కార్మికులను రప్పించి, ఉత్పత్తిని ప్రారంభిస్తే అన్నీ సర్దుకుంటాయన్నట్లు పైకి కనిపిస్తున్నా.. అంతర్గతంగా అనేక సమస్యలు పరిశ్రమలను చుట్టుముట్టనున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది.
ఉత్పత్తులు ప్రారంభించింది 60 శాతమే..
గ్రేటర్ పరిధిలో సుమారు 40వేలకుపైగా చిన్న, మధ్య తరహా పరిశ్రమలున్నాయి. ప్రధానంగా నగర పరిధిలో సనత్‌నగర్, ఆజామాబాద్, చందూలాల్ బారాదరి పారిశ్రామిక వాడలు ఉండగా, శివార్లలో ఉప్పల్, మౌలాలి, జీడిమెట్ల, కాటేదాన్, నాచారం, గాంధీనగర్, బాలానగర్, పటాన్‌చెరు, వనస్థలిపురం తదితర పారిశ్రామికవాడల్లో పెద్దసంఖ్యలో స్మాల్‌స్కేల్ ఇండస్ట్రీలు విస్తరించి ఉన్నాయి. ఇప్పటికే 90 శాతానికిపైగా పరిశ్రమలు తెరుచుకున్నా వీటిలో ఉత్పత్తులు ప్రారంభించింది మాత్రం 60 శాత్రమే ఉన్నాయి.
ఎంఎస్‌ఎంఈ వైపు చూపులు..
కష్టకాలంలో ఆర్థిక వెసులుబాటు కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీపై చిన్న, సూక్ష్మ తరహా పరిశ్రమల యాజమాన్యాలు ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆర్థిక చేయూత కోసం దరఖాస్తులతో ఎంఎస్‌ఎంఈకి ఉరుకులు పరుగులు తీస్తున్నాయి. వాస్తవంగా వర్క్ ఆర్డర్ల ఉత్పత్తి ఆగిపోవడంతో చెల్లింపులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. బ్యాంకు రుణాలు, విద్యుత్ బిల్లులు, కార్మికుల వేతనాలు చెల్లించే పరిస్థితి లేకుండా పోయింది. నగదు కొరత, చెల్లింపుల్లో ఆలస్యం, నగదు రొటేషన్ ఆగిపోవడం లాంటి సమస్యలు కూడా పరిశ్రమలపై ప్రభావం చూపుతున్నాయి. అప్పులపై వడ్డీ చెల్లింపులు కూడా భారంగా మారాయి.
చేయూత అందించాలి..
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీని తక్షణమే వర్తింపజేయాలి. ఎంఎస్‌ఎంఈ ప్రత్యేక చొరవ చూపి పరిశ్రమను బట్టి చేయూత అందించాలి. లాక్‌డౌన్ పీరియడ్ ఎలక్ట్రిసిటీ బిల్లులను, చార్జీలను ప్రభుత్వం రద్దు చేయాలి. పరిశ్రమలు నైపుణ్యం గల కార్మికులు తిరిగి వచ్చే విధంగా వెసులుబాటు కల్పించాలి.– జహంగీర్, సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల సంక్షేమ సంఘం అధ్యక్షుడు, బాలానగర్