ఇప్పట్లో బ్యాంకు షేర్లు వద్దు!
- నిపుణుల సూచన
మారిటోరియం పొడిగింపు, ఎన్‌బీఎఫ్‌సీలకు రుణసాయం పెంపు, లాక్‌డౌన్.. తదితర కారణాలు బ్యాంకులపై ఒత్తిడిపెంచుతాయని, అందువల్ల స్వల్పకాలానికి బ్యాంకు షేర్ల జోలికి పోవద్దని మార్కెట్ నిపుణులు సలహా ఇస్తున్నారు. తాజాగా ఆర్‌బీఐ ప్రకటించిన రేట్ కట్‌ను మార్కెట్ ఊహిస్తూనే ఉందన్నారు. రుణాల రిస్ట్రక్చరింగ్‌తో సహా ఇతర మద్దతు చర్యలు ప్రకటించకపోవడం బ్యాంకులకు ఇబ్బందికరమన్నారు. దీనికితోడు మారిటోరియం పొడగింపు కొత్తగా ఎన్‌పీఏలను పెంచవచ్చన్న భయాలు పెరిగాయని వివరించారు. ఇదే నిజమైతే క్రమంగా బ్యాంకుల బాలెన్స్ షీట్స్ దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. అందువల్ల ఎకానమీని రక్షించేందుకు ఆర్‌బీఐ ప్రకటించిన చర్యలు బ్యాంకులు లాభదాయకం కాదని అభిప్రాయపడ్డారు.
ఫైనాన్షియల్స్ రంగంలో ఒడిదుడుకులున్నందున ఇన్వెస్టర్లు కొత్తగా బ్యాంకు షేర్లలో పెట్టుబడులు మానుకోవాలని సామ్‌కో సెక్యూరిటీస్ సూచించింది. కరోనా సంక్షోభ పరిణామాలు పూర్తిగా బహిర్గతం అయి, బ్యాంకుల పద్దు పుస్తకాలపై భారం లేదని తెలిసిన అనంతరం వీటిని పరిశీలించవచ్చని తెలిపింది. వాల్యూషన్లు బాగా తక్కువగా ఉన్నాయని బ్యాంకు షేర్లను ఎంచుకోవడం సరికాదని సూచించింది. ఇప్పటికే బ్యాంకు షేర్లలో పెట్టుబడులు ఉన్న వాళ్లు హెడ్జింగ్ కోసం ఇతర రంగాల్లో బలమైన షేర్లను ఎంచుకోవాలని సలహా ఇచ్చింది. నిఫ్టీకి ఈ వారం 8700 పాయింట్ల వద్ద మద్దతు, 9200 పాయింట్ల వద్ద నిరోధం ఉన్నట్లు తెలిపింది. మ్యూచువల్ ఫండ్స్ సైతం అమ్మకాలకు దిగుతున్న ప్రస్తుత సందర్భంలో రిటైల్ ఇన్వెస్టర్లు నగదు చేతిలో ఉంచుకొని ఓపికగా వేచిచూడడం మంచిదని, రాబోయే వారాల్లో మార్కెట్లో మరింత ఇబ్బందులు ఉండొచ్చని అంచనా వేసింది.