https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/05/25/hyd.jpg?itok=3xErsTNF
చాదర్‌ఘాట్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎదుట శ్రుతి ధర్నా(ఫైల్‌)

బంగారు శ్రుతి కేసు!.. ఇలా ‘తెగించేశారు’.!



సాక్షి, సిటీబ్యూరో: వివిధ రకాలైన సివిల్‌ కాంట్రాక్ట్‌ పనులు చేసే కాంట్రాక్టర్లకు బ్యాక్‌ డేట్‌ బిల్లులు సుపరిచితమే...ల్యాండ్‌ స్కామ్‌లకు పాల్పడే నేరగాళ్లు పాత తేదీలతో ఉన్న డాక్యమెంట్లను సృష్టించేస్తూ ఉంటారు...వీటిని తలదన్నుతూ హైదరాబాద్‌ పోలీసులు తమ ‘మార్కు’ చాటుకున్నారు. బ్యాక్‌ డేట్‌తో ప్రాథమిక సమాచార నివేదిక (ఎఫ్‌ఐఆర్‌) రిజిస్టర్‌ చేశారు. ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్‌ బలాలాపై బీజేపీ మాజీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్‌ కుమార్తె బంగారు శ్రుతి ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో ఈ ‘కీలక ఘట్టం’ చోటు చేసుకుంది. ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద వచ్చిన ఈ ఫిర్యాదులో తాత్సారం చేసిన పోలీసులు న్యాయపరమైన ఇబ్బందులు రాకుండా ఉండాలనే ఉద్దేశంతో ఇలా ‘తెగించేశారు’.

అసలేం జరిగిందంటే..?
తూర్పు మండలంలోని చాదర్‌ఘాట్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలోని వచ్చే కమల్‌నగర్‌ ప్రాంతానికి చెందిన దళిత మైనర్‌ బాలికపై అత్యాచారం జరిగింది. దీనికి సంబంధించి స్థానిక ఎంఐఎం నాయకుడు షకీల్‌పై కేసు నమోదైంది. అయితే సరైన సెక్షన్ల కింద కేసు నమోదు చేయలేదంటూ దళిత సంఘాలు విమర్శించాయి. కొందరు ఆ కుటుంబాన్ని ఓదార్చడానికి, ధైర్యం చెప్పడానికి బాలిక ఇంటిని సందర్శించారు. ఇందులో భాగంగా బంగారు శ్రుతి ఈ నెల 7న కమల్‌నగర్‌కు వెళ్లారు. ఆ సమయంలో అక్కడకు వచ్చిన ఎంఐఎం పార్టీ మలక్‌పేట ఎమ్మెల్యే అçహ్మద్‌ బలాలా విషయం తెలుసుకుని వెనుదిరిగారు. ఈ నెల 9న బలాలాకు చెందిన ఫేస్‌బుక్‌ పేజీలో ఉన్న ఓ వీడియోను శృతి చూశారు. అందులో ఆయన తనను దూషిస్తూ మాట్లాడారని గుర్తించి అదే రోజు చాదర్‌ఘాట్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

https://www.sakshi.com/sites/default/files/article_images/2020/05/25/hyd2.jpg

బ్యాక్‌డేట్‌తో పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ఇలా..
అప్పట్లో న్యాయ సలహా అంటూ...
దళిత మహిళనైన తనను ఉద్దేశించి విలేకరులతో మాట్లాడుతూ బలాల వినియోగించిన పదజాలాన్ని పరిగణనలోకి తీసుకుని ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయాల్సిందిగా కోరారు. ఈ ఫిర్యాదు స్వీకరించిన చాదర్‌ఘాట్‌ పోలీసులు అదే రోజు జనరల్‌ డైరీలో ఎంట్రీ (పేరా నెం.11) చేశారు. సాధారణంగా ఇలాంటి ఫిర్యాదుల్ని స్వీకరించే పోలీసులు తక్షణం కేసుగా నమోదు చేస్తారు. అయితే బంగారు శ్రుతి ఫిర్యాదును మాత్రం న్యాయ సలహా కోసం పంపారు. ఈ కేసు నమోదులో ఆలస్యంపై ఎవరు ప్రశ్నించినా ఉన్నతాధికారులు ఇదే విషయం చెప్పుకుంటూ వచ్చారు. తన ఫిర్యాదును పోలీసులు పట్టించుకోవట్లేదంటూ బంగారు శ్రుతితో పాటు దళిత సంఘాలు, బీజేపీ నాయకులు వరుస నిరసనలు తెలిపారు. బంగారు శ్రుతి గురువారం చాదర్‌ఘాట్‌ పోలీసుస్టేషన్‌ ముందే ధర్నాకు దిగారు. త్వరలోనే కేసు నమోదు చేస్తామంటూ ఆమెకు సర్దిచెప్పిన అధికారులు అక్కడ నుంచి పంపారు. 

దర్యాప్తు అధికారిగా ఇన్‌స్పెక్టరే...
సాధారణంగా ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద నమోదయ్యే కేసుల్ని ఏసీపీ స్థాయి అధికారి దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. ఫిర్యాదులోని ఆరోపణలపై అనుమానాలు ఉన్నా, ఫిర్యాది ఆ సామాజిక వర్గానికి చెందిన వారా? కాదా? అనే సందేశం ఉన్నా? వీటిని నిగ్గు తేల్చే బాధ్యతల్ని సదరు ఏసీపీ తన ఇన్‌స్పెక్టర్‌కు అప్పగించే ఆస్కారం ఉంటుంది. అయితే బంగారు శ్రుతి ఫిర్యాదుపై పోలీసులు న్యాయ సలహా కూడా తీసుకున్నారు. ఈ విషయాన్ని స్పష్టం చేసిన ఎఫ్‌ఐఆర్‌లోనే దర్యాప్తు బాధ్యతల్ని చాదర్‌ఘాట్‌ ఇన్‌స్పెక్టర్‌కే అప్పగిస్తున్నట్లు పొందుపరిచారు. ఈ ఫిర్యాదు, కేసు నమోదు విషయంలో కింది స్థాయి అధికారులు, ఉన్నతాధికారుల మధ్య ఓ కోల్డ్‌ వార్‌ జరిగినట్లు తెలిసింది. కేసు నమోదు చేస్తామంటూ కింది స్థాయి అధికారులు, వద్దంటూ పై అధికారులు తాత్సారం చేశారు. కేసు వద్దంటే తనను బదిలీ చేయండి అంటూ ఓ అధికారి ఉన్నతాధికారుల వద్ద వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ఇలా ఎన్నో మలుపులు తిరిగిన ఈ కేసు చివరకు ‘బ్యాక్‌ డేట్‌’తో రిజిస్టరైంది.  

బ్యాక్‌డేట్‌తో ఎఫ్‌ఐఆర్‌ రిజిస్టర్‌...
ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కిందికి వచ్చే ఫిర్యాదుల విషయంలో పోలీసులు ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా న్యాయస్థానాలు ఉపేక్షించవు. ఏమాత్రం తేడా వచ్చినా ఉన్నతాధికారులు సైతం కోర్టు మెట్లు ఎక్కి సమాధానం చెప్పుకోవాల్సిందే. హఠాత్తుగా ఈ విషయం ‘గుర్తుకువచ్చిన’ నగర పోలీసులు శనివారం బంగారు శ్రుతి ఫిర్యాదుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశామంటూ సందేశాలు లీక్‌ చేశారు. పోలీసు అధికారిక వెబ్‌సైట్‌ నుంచి ఆ ఎఫ్‌ఐఆర్‌ కాపీని డౌన్‌లోడ్‌ చేసుకుని పరిశీలిస్తే అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. ఎఫ్‌ఐఆర్‌ నెం.142/2020 కింద నమోదు చేసిన దీనిపై తేదీ మాత్రం ఈ నెల 9గా ఉంది. వెబ్‌సైట్‌ ప్రకారం ఆ రోజు కేవలం ఒకే కేసు నమోదైంది. అది కూడా ఓ వ్యక్తికి కాలిన గాయాలు కావడానికి సంబంధించి ఎఫ్‌ఐఆర్‌ నెం.120/2020తో నమోదైంది. ఇంతకంటే ఘోరమేమిటంటే... ఎఫ్‌ఐఆర్‌ నెం.141/2020 అనేది ఈ నెల 22వ తేదీ (శుక్రవారం) నమోదు కాగా... 142/2020 అనేది 9న రిజిస్టర్‌ కావడం. బంగారు శ్రుతి ఫిర్యాదుకు సంబంధించి తమకు 23వ తేదీ ఉదయం 7.50 గంటలకు న్యాయ సలహా అందిందని, దీన్ని పరిగణనలోకి తీసుకుని నమోదు చేశామని చెబుతున్న కేసుపై 9వ తేదీ ఉండటం గమనార్హం.