జియాగూడలో కొనసాగుతున్న ఇంటింటి సర్వే
- జియాగూడలో కొనసాగుతున్న ఇంటింటి సర్వే
- ప్రజలు సహకరించాలని కోరుతున్న డాక్టర్లు, అధికారులు
అబిడ్స్/జియాగూడ: కరోనా మహమ్మారిని నివారించేందుకు జియాగూడ మున్సిపల్ డివిజన్‌లో అర్బన్ హెల్త్ ప్రైమరీ సెంటర్ వైద్యాధికారులు, ఆశ వర్కర్లు, పోలీసులు ముమ్మర ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. జియాగూడ మున్సిపల్ డివిజన్‌లో వందకు పైగా కరోనా కేసులు నమోదు కావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కుల్సుంపురా పోలీస్‌స్టేషన్ పరిధిలోని జియాగూడ ప్రాంతాలైన ఇందిరానగర్, వెంకటేశ్వర్‌నగర్, దుర్గానగర్, సాయిదుర్గానగర్, మక్బరా, మేకలమండి, సబ్జిమండి, ఇక్బాల్‌గంజ్, సంజయ్‌నగర్ బస్తీల్లో కరోనా మహమ్మారి వేగంగా విస్తరించింది. ఈ వైరస్‌ను కట్టడి చేసేందుకు జియాగూడ నలుమూలలా గోషామహల్ ఏసీపీ నరేందర్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ అధికారులు కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేశారు. దీంతో గత 10 రోజులుగా జియాగూడ పరిసర ప్రాంతాల్లో కరోనా తగ్గుముఖం పడుతోందని, కరోనాను నియంత్రించేందుకు కంటైన్మెంట్ ప్రాంతాలను కట్టడి చేయడంతో పాటు పలు హాట్‌స్పాట్లను కూడా అధికారులు ఏర్పాటు చేశారు.
వైద్య ఆరోగ్యశాఖ అధ్వర్యంలో ఇంటింటి సర్వే...
కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న బస్తీలతో పాటు కంటైన్మెంట్ జోన్లలో ప్రతిరోజు వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎం.సుధా ఆధ్వర్యంలో ఆశవర్కర్లు, ఏఎన్‌ఎంలు ఇంటింటికి తిరుగుతూ ప్రజల వివరాలు సేకరిస్తున్నారు. ఎవరి ఇంట్లోనైనా కోవిడ్–19 లక్షణాలు ఉన్న వ్యక్తి ఉంటే వెంటనే అధికారులకు సంప్రదించాలని, అతడికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించి అంబులెన్స్‌లో గాంధీ ఆస్పత్రికి తరలించడం, లేక ఇంట్లోనే ఉంచి పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది.
కంటైన్మెంట్ జోన్లలో భారీ బందోబస్తు...
జియాగూడలోని 10 కంటైన్మెంట్ జోన్లలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బస్తీలు, కాలనీలను కంటైన్మెంట్లు ఏర్పాటు చేయడంతో పోలీసులు ప్రజలను బయటికి రానివ్వడం లేదు. అత్యవసర పరిస్థితిలో తప్ప కాలనీవాసులు బయటికి రావొద్దని పోలీసులు సూచిస్తున్నారు. 24 గంటల పాటు కట్టుదిట్టమైన నిఘాను పెట్టి, జీహెచ్‌ఎంసీ అధికారుల సాయంతో ప్రతిరోజు నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నారు.
అధికారుల పర్యటన...
కంటైన్మెంట్ జోన్లకు పలు శాఖల అధికారులు పర్యటించి స్థానిక ప్రజలకు మనోధైర్యాన్ని పెంచుతున్నారు. వైరస్‌ని నిర్మూలించడానికి డివిజన్ నలుమూలలా హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయిస్తున్నారు. ఇటీవల కుల్సుంపురా పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తూ కరోనాతో కానిస్టేబుల్ మృతి చెందడంతో స్టేషన్‌కు నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ సందర్శించి ప్రజలకు, పోలీసులకు పలు జాగ్రత్తలతో కూడిన సూచనలు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకుని, బయటకు వచ్చేటప్పుడు మాస్క్, శానిటైజర్లు వాడాలని ఆయన తెలిపారు.
సర్వేతో పాటు అవగాహన కల్పిస్తున్నాం
కరోనా నివారణకు వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో ఇంటింటికి సర్వే నిర్వహించి, ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. జియాగూడలో వేలాది మందికి పరీక్షలు నిర్వహించాం. కోవిడ్–19 లక్షణాలు ఉన్న వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి వైద్యసేవలు అందిస్తున్నాం. కంటైన్మెంట్ జోన్లలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతోంది. పూర్తి స్థాయి నియంత్రణకు మరింత మ ందికి పరీక్షలు నిర్వహించడానికి ఆశవర్కర్లు, ఏఎన్‌ఎం సిబ్బంది సహకారంతో సర్వే చేపడుతున్నాం. మీ పరిసరాల్లో ఎవరికైనా జ్వరం, దగ్గు, జలుబు లాంటి లక్షణాలు కనిపిస్తే వైద్యసిబ్బందికి లేక అధికారులకు సంప్రదిస్తే వారికి పరీక్షలు నిర్వహించి ఆస్పత్రికి తరలిస్తాం. దీంతో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయగలం. డాక్టర్ ఎం.సుధా, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ
కంటైన్మెంట్ల ఏర్పాటుతో కరోనా కట్టడి
జియాగూడలో కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేయడం ద్వారా కరోనా తగ్గుముఖం పట్టింది. జోన్ ప్రజలు పోలీస్ నిబంధనలు పాటించాలి. నిత్యావసరాలు కానీ, ఇతర వస్తువులు కావాలనుకున్నప్పుడు అధికారులకు సంప్రదిస్తే వాళ్లే మీ ఇంటికి వచ్చి సరుకులు అందజేస్తారు. అంతేకాకుండా జోన్‌లో నిబంధనలు తప్పక పాటించాలి. ప్రతిఒక్కరు భౌతిక దూరం పాటించడంతో పాటు ఇంట్లో ఉన్నప్పుడు శానిటైజేషన్, బయటకు వెళ్తే మాస్క్‌లు ధరించాలి. అధికారులకు, పోలీసులకు ప్రజలు పూర్తిస్థాయిలో సహకరించి కరోనా నియంత్రణకు కృషి చేయాలి. నరేందర్‌రెడ్డి, గోషామహల్ ఏసీపీ