90శాతం కేసులు 10 రాష్ట్రాల్లోనే..!
న్యూఢిల్లీ: భారత్‌లో సరైన సమయంలో లాక్ డౌన్ అమలు చేయడంతో కరోనా వైరస్ వ్యాప్తిని సమర్థంగా కట్టడి చేయగలిగామని సెంట్రల్ కరోనా టాస్క్ ఫోర్స్ ఎంపవర్డ్ గ్రూప్ -1 చైర్మన్ వీకే పాల్ అన్నారు. లాక్‌డౌన్ కారణంగా కేసుల సంఖ్య తగ్గడంతో పాటు మరణాలను చాలా వరకు నియంత్రించగలిగామన్నారు. దేశంలో నెలకొన్నపరిస్థితులపై కేంద్ర వైద్య ఆరోగ్య ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు. లాక్‌డౌన్‌కు ముందు, లాక్‌డౌన్ అనంతర పరిస్థితుల మధ్య చాలా వ్యత్యాసం కనిపించిందని చెప్పారు. సకాలంలో తీసుకున్న చర్యల వల్ల కోవిడ్-19 విస్తరించకుండా కొన్ని ప్రాంతాలకే పరిమితం చేయగలిగామని, భవిష్యత్ సన్నద్ధతపై అవగాహన కూడా పెంచుకోగలిగామని చెప్పారు
కాగా దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన 1,38,536 కరోనా కేసుల్లో ఎక్కువ భాగం కొన్ని రాష్ట్రాల్లోనే ఉన్నాయని, మరికొన్ని ప్రాంతాల్లో కరోనా తీవ్రత చాలా తక్కువగానే ఉందన్నారు. ప్రస్తుతం దేశంలో మొత్తం 73,560 యాక్టివ్ కేసులు ఉండగా.. అందులో 70 శాతం కేవలం పది సిటీల్లోనే ఉన్నాయన్నారు. దేశంలోని 90 శాతం యాక్టివ్ కేసులు కేవలం 10 రాష్ట్రాల్లోనే ఉన్నాయని, ఇక మిగిలిన 10 శాతం కేసులు దేశం మొత్తంగా ఉన్నాయని వీకే పాల్ పేర్కొన్నారు. దేశంలో ఉన్న మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల్లో 80 శాతం మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, ఢిల్లీ, మధ్యప్రదేశ్‌లలోనే ఉన్నాయన్నారు. ఇక కరోనాతో సంభవించిన మరణాలు కూడా కొన్ని రాష్ట్రాలు, సిటీల్లోనే నమోదైనట్లు వీకే పాల్ తెలిపారు. చదవండి: ‘ఆయన ఆచూకీ చెబితే రూ.5,100 బహుమతి’