టిక్‌టాక్ వద్దన్నందుకు తల్లీ కొడుకుపై దాడి
జూబ్లీహిల్స్: చీకటి పడిన తర్వాత కూడా బస్తీలో రాత్రి 9 గంటల వరకు ఉంటూ టిక్‌టాక్ వీడియోలు తీయవద్దని చెప్పినందుకు ఓ యువకుడిని, అతని తల్లిపై కొంత మంది దాడి చేసిన సంఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాలు.. బంజారాహిల్స్ రోడ్ నెం.10లోని సింగాడికుంట దోభీఘాట్ బస్తీలో నివాసం ఉంటున్న సురేష్ సీఎం క్యాంప్ కార్యాలయంలో అవుట్‌సోర్సింగ్ విభాగంలో అటెండర్‌గా పని చేస్తుంటాడు. (టిక్‌టాక్ పిచ్చిలో పిల్లికి ఉరేసి చంపాడు)
శనివారం రాత్రి కొంత మంది యువకులు సురేష్‌పై దాడి చేస్తుండగా వారిని ఆపేందుకు వెళ్లిన అతని తల్లిని కూడా కొట్టారు. రోజూ రాత్రి పొద్దుపోయే దాకా పది మంది వరకు యువకులు ఇక్కడే కూర్చొని టిక్‌టాక్ వీడియోలు తీస్తూ న్యూసెన్స్‌కు పాల్పడుతున్నారని, ఇలా చేయవద్దని సురేష్ ప్రశ్నించడంతో ఆ యువకులు ఆగ్రహం చెంది దాడి చేశారు. తనపై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేయాలని బాధితుడు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇందుకు సంబంధించిన సీసీ ఫుటేజీని కూడా పోలీసులకు అందించడంతో కేసు దర్యాప్తు చేస్తున్నారు.