నవదంపతులకు హనీమూన్ కష్టాలు
సాక్షి, భువనేశ్వర్ : ఏడు రోజుల హనీమూన్ కోసం మలేషియా వెళ్లిన నవదంపతులు లాక్‌డౌన్ కారణంగా 68 రోజుల తరువాత ఇంటికి చేరారు. ఈ సంఘటన రాష్ట్రంలోని నవరంగపూర్ జిల్లాలో చోటుచేసుకుంది. దంపతుల రాకతో వారి కుటుంబాల్లో ఆనందం నెలకొంది. నవరంగపూర్ ఇచ్చాగుడ గ్రామానికి చెందిన శంకర హల్దార్ అతడి భార్య పల్లవి మిశ్రాలు పెళ్లి తరువాత గత మార్చి 12వ తేదీన మలేషియా వెళ్లారు. హానీమూన్ ముగించుకొని మార్చి 17వ తేదీన భారత్ రావాల్సి ఉంది. అదే సమయంతో కరోనా వైరస్‌తో ప్రపంచం అంతా దాదాపు లాక్‌డౌన్‌లో ఉండటంతో వీరు మార్చి 17వ తేదీ రాత్రి మలేషియా విమానాశ్రయానికి స్వదేశం వచ్చేందుకు చేరుకున్నారు. అయితే అప్పటికే కరోన కారణంగా భారత్ దేశ ప్రభుత్వం విదేశాలకు వెళ్లే అన్ని విమానాలను రద్దు చేసింది. ( తల్లి ప్రేమకు ప్రతీక )
దీంతో వారు విమానాశ్రయంలో చిక్కుకు పోయారు. మలేషియా ప్రభుత్వం అక్కడి ప్రయాణికులందరికి వసతి ఏర్పాటు చేసింది. భారత్ ప్రభుత్వం లాక్‌డౌన్ 4లో విదేశాలలో ఉన్న భారతీయులను స్వదేశానికి రప్పించే కార్యక్రమంలో భాగంగా నవదంపతులు దాదాపు 68 రోజుల తరువాత శుక్రవారం భువనేశ్వర్ చేరుకున్నారు. దీంతో వారు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు.