అన్ని విమానాల్లో మధ్య సీటు ఖాళీగా ఉంచాల్సిందే :సుప్రీం
విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించేందుకు ఉద్దేశించిన స్పెషల్ విమానాల్లో మధ్య సీటును ఖాళీగా ఉంచాల్సిందేనని సుప్రీం కోర్టు ప్రభుత్వానికి స్పష్టం చేసింది. భౌతిక దూరం అన్నది చాలా ముఖ్యమని పేర్కొంది. బయట ఒక్కో వ్యక్తికి మధ్య ఆరు అడుగుల దూరాన్ని పాటిస్తున్నప్పుడు విమానాల్లో మధ్య సీటునుఖాళీగా ఉంచక పోవడమేంటని ప్రశ్నించింది. అయితే నిపుణుల సలహా పైనే విమానాల్లో మధ్య సీటును ఖాళీగా ఉంచడం లేదని కేంద్రం తరపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. సరైన విధానమేమిటంటే టెస్టింగ్, క్వారంటైన్ అన్నవే అని ఆయన పేర్కొన్నారు. కానీ దీనితో విభేదించిన కోర్టు.. విమాన ప్రయాణికులకు ఈ వైరస్ సోకదని ఎలా భావిస్తారని కూడా ప్రశ్నించింది. జూన్ 16 వరకు బుకింగ్స్ జరిగాయని తుషార్ మెహతా పేర్కొనగా.. ఇకపై అన్ని ప్రత్యేక విమానాల్లో మధ్య సీటును ఖాళీగా ఉంచాలని కోర్టు ఆదేశించింది.