మధ్య సీటూ నింపుకోవచ్చు
ఎయిర్ ఇండియా ప్రయాణాలకు సుప్రీం కోర్టు అనుమతి
న్యూఢిల్లీ : రానున్న 10 రోజుల్లో మధ్య సీటూ నింపుకుని ఎయిర్ ఇండియా విమాన ప్రయాణాలను నిర్వహించేందుకు సుప్రీంకోర్టు సోమవారం అనుమతించింది. డిజిసిఎ సర్క్యులర్‌లకు వ్యతిరేకంగా వేసిన పిటిషన్ వేగంగా విచారించాలని బంబాయి హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. భౌతిక దూరం పాటించడం, రెండు సీట్ల మధ్య ఖాళీ ఉంచడంతోపాటు హైకోర్టు సూచించిన భద్రతా ప్రమాణాలను ఎయిర్ ఇండియా, ఇతర విమాన సంస్థలు పాటించాలని సుప్రీంకోర్టు తెలిపింది. బంబాయి హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం, ఎయిర్ ఇండియా వేసిన పిటిషన్‌ను ఈద్ సెలవు రోజున ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఎ బాబ్డే అధ్యక్షతన గల బెంచ్ అత్యవసరంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించింది. కోవిడ్-19 నేపథ్యంలో భారతీయులను స్వదేశం తీసుకొస్తున్న విమానాల్లో ఎయిర్ ఇండియా, పౌరవిమానయాన శాఖ డైరక్టరేట్ జనరల్ (డిజిసిఎ)లు కనీస భద్రతా చర్యలు పాటించడం లేదని ఎయిర్ ఇండియా పైలెట్ డెవెన్ కనని బంబాయి హైకోర్టులో పిటీషన్ వేశారు. దీనిని విచారణను జూన్ 2కు హైకోర్టు వాయిదా వేసింది. భద్రతాచర్యలు పాటిస్తున్నామని, ఈ నెల 23న కొత్త భద్రతాచర్యల మార్గదర్శకాలూ కూడా విడుదల చేశామని హైకోర్టుకు ఎయిర్ ఇండియా తెలిపింది. ఈ కొత్త మార్గదర్శకాల్లో మధ్య సీటును ఖాళీగా ఉంచాల్సిన అవసరం లేదని పేర్కొనడం గమనార్హం.