http://www.prajasakti.com/./mm/20200525//1590414424.jagan.jpg

కాళ్లవాపు వ్యాధిగ్రస్తులకు వైద్యచికిత్స- సిఎం ఆదేశం

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో
తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీలో కాళ్లవాపు వ్యాధిగ్రస్తులకు వెంటనే వైద్యచికిత్సలు అందించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. తక్షణమే బాధితులను పరామర్శించాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నానిని, అధికారులను ఆదేశించారు. మళ్లీ ఈ వ్యాధిరాకుండా ఉండాలంటే ఏం చేయాలన్న దానిపై సమగ్ర ప్రణాళిక తయారు చేయాలని, వెంటనే వైద్య బఅందాలను పంపి చికిత్స అందించాలని ఆదేశాలు జారీచేశారు. న్యాయవాదుల సంక్షేమం కోసం ప్రభుత్వం కేటాయించిన రూ.100 కోట్లను వారి కార్పస్‌ నిధికే అప్పంగించాలని ఆదేశించారు. ఈ నిధుల నిర్వహణను వారికే అప్పగించాలని అధికారులకు స్పష్టం చేశారు. లా నేస్తం పేరిట ప్రభుత్వం ఇప్పటికే న్యాయవాదులను ఆదుకుంటోందని, బదిలీచేసిన నిధి ద్వారా మరింత ప్రయోజనం పొందుతారని ఆకాంక్షించారు.
అర్చకులు, పాస్టర్లు, ఇమామ్‌లు, మౌజమ్‌లకు ఆర్థిక సాయం
లాక్‌డౌన్‌ కారణంగా మతపరమైన కార్యక్రమాలు నిలిచిపోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న అర్చకులు, పాస్టర్లు, ఇమామ్‌లు, మౌజమ్‌లను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వారికి ఐదువేల వేల చొప్పున వన్‌టైం సాయం అందించేందుకు చర్యలు తీసుకుంది. దీనికోసం దాదాపు రూ.38 కోట్లు అందించనుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మంగళవారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వీరి సంఖ్య 77 వేలమందికి పైగా ఉంటారని అంచనా వేస్తున్నారు. 34 వేల మంది అర్చకులు, 30 వేల మంది పాస్టర్లు, 14 వేల మంది ఇమామ్‌, మౌజమ్‌లు ఈ సహాయాన్ని పొందనున్నారు.