http://www.prajasakti.com/./mm/20200525//1590420408._1590303211.jpg

'మీ తండ్రి ఉద్యోగం ఇచ్చారా?'

 వలస కార్మికుడిపై జేడీయూ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు

పాట్నా : ఊహించని కష్టాలు...నష్టాలతో విలవిల్లాడుతున్న వలస కార్మికుడి పట్ల బీహార్‌లో జేడీయూ ఎమ్మెల్యే రంధీర్‌ కుమార్‌ సోని వ్యవహరించిన తీరు తీవ్ర దుమారం రేపింది. ఇటు రాష్ట్రంలో (జేడీయూ, బీజేపీ), అటు కేంద్రంలో అధికారంలో ఉన్నది ఎన్డీయే కదా! ఉపాధి, ఉద్యోగాలు కల్పించటంలో ఎందుకు విఫలమయ్యారు? అని వలస కార్మికులు ప్రశ్నిస్తే, సమాధానం చెప్పలేక రంధీర్‌ అడ్డగోలు మాటలతో వలస కార్మికుల్ని బెదరగొట్టారు. దీనికి సంబంధించి వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో ప్రసారం కావటంతో వైరల్‌గా మారింది. మే 22న జరిగిన ఈ ఘటనలో వలస కార్మికులు ఎమ్మెల్యే రంధీర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీహార్‌ షెయిక్‌పూర్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే రంధీర్‌, అక్కడి చండి గ్రామంలో ఏర్పాటు చేసిన ఓ క్వారంటైన్‌ కేంద్రాన్ని సందర్శించారు. ఈ క్రమంలో అక్కడ ఉన్న వలస కార్మికులు ఉద్యోగాలు, మౌళిక వసతుల గురించి ఎమ్మెల్యేను ప్రశ్నించారు. కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం తగినన్ని ఉద్యోగాలు కల్పించడంలో ఎందుకు వెనకబడ్డాయి? అంటూ వలస కూలీలు రంధీర్‌ కుమార్‌ను ప్రశ్నించారు. దానికి సదరు ఎమ్మెల్యే 'నిన్ను పెంచిన తండ్రి వల్ల నీకు ఉద్యోగం వచ్చిందనుకుంటున్నావా? ప్రభుత్వం వల్లే నీకు ఉపాధి లభించింది' అనే అర్థం వచ్చేట్టు మాట్లాడటం సర్వత్రా ఆగ్రహం తెప్పించింది.
వలస కూలీలకు, ఎమ్మెల్యేకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పరిస్థితి చేయి దాటడంతో రంధీర్‌ అక్కడి నుంచి మరో క్వారంటైన్‌ కేంద్రానికి వెళ్లారు. అయితే రంధీర్‌ వ్యాఖ్యలపై ప్రతిపక్ష నాయకుడు తేజస్వీ యాదవ్‌ మండిపడడ్డారు. ఎమ్మెల్యే అసంబద్ధ వ్యాఖ్యలు చేశారని తేజస్వీ ఆగ్రహం వ్యక్తం చేశారు.