భూకంపంలోనూ ప్రధాని ఇంటర్వ్యూ
నెటిజన్లు ఫిదా
వెల్లింగ్టన్: భూకంపం వస్తున్నా ఇంటర్వ్యూ ఇస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్. సోమవారం ఉదయం న్యూజిలాండ్‌లో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.8గా నమోదైంది. కాగా, భూమి కంపించిన సమయంలో ఒక టీవీ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇస్తున్న ప్రధాని జెసిండా ఆర్డెర్న్ మాత్రం ఎలాంటి భయాందోళనలకు గురి కాకుండా ఆ కార్యక్రమాన్ని కొనసాగించారు. ఆమె ఉన్న భవనం కుదుపులకు గురవుతున్నా.. పెద్దగా ఆందోళనచెందలేదు. ఆమె రియాక్షన్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో నెటిజన్లు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎందుకంటే పార్లమెంటు కాంప్లెక్సులో ఉండే ఆ భవనం భూకంపాలకు సైతం తట్టుకునేలా నిర్మించారు. అయితే భూమి కంపించిన సమయంలో ఇంటర్వ్యూ శైలి కొంత మారిపోయింది. ఇక్కడ భూమి కంపిస్తోంది. చుట్టు వస్తువులు కదులుతున్నాయి చూశావా? అంటూ ఇంటర్వ్యూ చేస్తున్న ర్యాన్‌ను జెసిండా అడిగారు. 'ఇక ఆగిపోయింది. సురక్షితంగా ఉన్నాం. నాపై ఎలాంటి వేలాడుతున్న లైట్లు లేవు. నేను ఉన్న నిర్మాణం చాలా దఅఢమైనదనుకుంటా' అని కాసేపటి తర్వాత చాలా సాధారణంగా వ్యాఖ్యానించారు జెసిండా. కాగా, న్యూజిలాండ్‌లో సోమవారం ఉదయం సంభవించిన భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని అధికారులు వెల్లడించారు. ఇప్పటికే జెసిండా న్యూజిలాండ్ ప్రధానిగా ఆ దేశంలో కరోనా వైరస్ మహమ్మారిని ధైర్యంగా ఎదుర్కొంటూ అందరి ప్రశంసలందుకుంటున్న సంగతి తెలిసిందే.